మహారాష్ట్రలో కరోనా ఊగ్ర రూపం దాల్చింది. ఒక్క రోజులోనే భారీగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో ఆ రాష్ట్రంలో కొత్తగా 47,827 కరోనా కేసులు నమోదయ్యాయి. 202 మంది చనిపోయారు. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 29,04,076కు చేరుకుంది. 3,89,832 యాక్టివ్ కేసులు ఉండగా 55,379 మంది కరోనా వల్ల ఇప్పటి వరకు చనిపోయారు.
మహారాష్ట్ర వైద్య విభాగం ఈ మేరకు శుక్రవారం రాత్రి వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం ముంబైలోనే 57,687 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. అలాగే ఆ నగరంలో 11,727 మంది చనిపోయారు. పూణెలో 70,851 యాక్టివ్ కేసులు ఉండగా ఆ నగరంలో ఇప్పటి వరకు 8,373 మంది చనిపోయారు. 4,74,141 మంది రికవరీ అయ్యారు.
మరోవైపు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. పరిస్థితి ఇంకా విషమించితే రాష్ట్రంలో లాక్‌డౌన్ పెట్టక తప్పదని అన్నారు. ఇప్పటి వరకు 65 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ఇచ్చామని, గురువారం ఒక్క రోజే 3 లక్షల వ్యాక్సిన్ డోసులను ఇచ్చామని తెలిపారు. అయితే కొందరు వ్యాక్సిన్లను తీసుకున్న తరువాత నిర్లక్ష్యంగా ఉంటున్నారని, మాస్కులను ధరించడం లేదని, అందువల్ల వారు కూడా కోవిడ్ బారిన పడుతున్నారని అన్నారు. కనుక ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అన్నారు.
ఇక మహారాష్ట్రలో రోజుకు 2.50 లక్షల ఆర్టీ-పీసీఆర్ టెస్టులను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం ఉద్ధవ్ థాకరే తెలిపారు. మరో 2 రోజుల్లో కోవిడ్ నియంత్రణకు కఠిన నిబంధనలను జారీ చేస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో కోవిడ్ కేసుల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే రాష్ట్రంలో వైద్య రంగంలో మౌలిక సదుపాయాలకు కొరత ఏర్పడుతుందని అన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే మరో 15-20 రోజుల అనంతరం మౌలిక సదుపాయాలకు ఇబ్బందులు ఏర్పడుతాయని అన్నారు. అయితే మహారాష్ట్రలో భారీగా కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అక్కడ కచ్చితంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తారని తెలుస్తోంది.