గోవా సీఎం సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అర్థరాత్రి బీచ్ లో ఆడపిల్లలకు ఏం పని ఉంటుందని అన్నారు. ఆ రాష్ట్రంలో గత 5 రోజుల కిందట జరిగిన సామూహిక అత్యాచారం సంఘటన నేపథ్యంలో ఆయన అసెంబ్లీలో పై విధంగా మాట్లాడారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.
జూలై 24వ తేదీన గోవా రాజధాని పనాజీకి సుమారుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోల్వా అనే బీచ్‌లో 10 మంది టీనేజర్లు పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో పార్టీ అయిపోయాక వారిలో 6 మంది ఇళ్లకు వెళ్లిపోయారు. ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు రాత్రంతా బీచ్‌లోనే ఉన్నారు. అయితే అదే సమయంలో అటు కొందరు యువకులు వచ్చి ఆ ఇద్దరు బాలురను గాయపరిచారు. అనంతరం ఆ బాలికలపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
అయినప్పటికీ ఆ రాష్ట్రంలో నిరసన సెగలు ఆగడం లేదు. ఆ సామూహిక అత్యాచారం ఘటన ఆ రాష్ట్ర సర్కారుకు ఇబ్బందిగా మారింది. అక్కడ ఈ సంఘటన తీవ్ర దుమారం రేపుతోంది. అసెంబ్లీలో సర్కారును విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
బాధితులకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీలోనూ చర్చ సాగించారు. అయితే చర్చ సందర్భంగా సీఎం సావంత్ మాట్లాడుతూ.. అసలు ఆడ పిల్లలను అర్థరాత్రి బయటకు ఎందుకు పంపించారు ? బీచ్ లో అంత రాత్రి పూట వారికి ఏం పని ? అని అన్నారు. అర్థరాత్రి పిల్లలు బయటకు వెళ్లారంటే అది తల్లిదండ్రుల బాధ్యతేనని, దీనిపై ప్రభుత్వం, పోలీసులను తప్పుబట్టడం సమర్థనీయం ఎలా అవుతుందని.. అన్నారు. దీంతోపై సావంత్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సీఎం ఆడపిల్లలను అవమానించేలా మాట్లాడారని, వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.