దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఏర్పడింది. ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో తాజాగా 18 సంవత్సరాల పైబడిన వారందరికీ మే 1 నుంచి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. అయితే ఇది వరకు రెండు దశలలో మాదిరిగా వ్యాక్సిన్ అందరికీ ఉచితంగానే వేశారు. ఈ క్రమంలోనే 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఉచితంగానే ఉంటుందని భావించారు.
కానీ కేంద్ర ప్రభుత్వం తాజాగా 18 సంవత్సరాలు పైబడిన వారు టీకా వేయించుకోవాలంటే బయట మార్కెట్లో కొనాలి. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చులు భరించి ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని తెలియజేసింది. వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం 50 శాతం భారాన్ని మోస్తూ 50 శాతం రాష్ట్రాలపై నెట్టింది. అయితే ఇప్పటి వరకు మొదటి డోస్ వేయించుకున్న ఫ్రంట్లైన్ వారియర్స్, వృద్ధులు, 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ రెండవ డోస్ టీకా ఉచితంగానే అందించనుంది.
తాజాగా కేంద్ర ప్రభుత్వం 18 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా కరోనా వ్యాక్సిన్ కి అర్హులని ప్రకటించింది. అయితే వీరందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించలేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై పలు ఆరోపణలు తలెత్తుతున్నాయి. వ్యాక్సిన్ సంస్థలకు మార్కెట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుందని, ఈ నిర్ణయం వల్ల స్థానిక యంత్రాంగం పై ఒత్తిడి పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.