కనిపించకుండా పోయిన వ్యక్తులు తిరిగి కుటంబ సభ్యులను చేరుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. పోలీసులు అన్ని విధాలుగా కష్టపడి పనిచేస్తే కొంత వరకు ఈ విషయంలో ఫలితం దక్కవచ్చు. కానీ ఒక్కోసారి వారు కూడా ఏమీ చేయలేరు. దీంతో మిస్సింగ్ అయిన వ్యక్తుల వివరాలు అసలు ఏమీ తెలియవు. అయితే ఆ వ్యక్తి కూడా ఇలాగే 24 ఏళ్ల కిందట ఇంట్లో నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయాడు. చాలా ఏళ్లు గడిచాయి. ఇక అతను చనిపోయాడనే అందరూ భావించారు. కానీ ఎట్టకేలకు మళ్లీ అతను ఇప్పుడు ఇంటికి తిరిగొచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులు ఓ వైపు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే మరో వైపు ఆందోళనకు గురవుతున్నారు.
ఉత్తరాఖండ్ లోని అల్మోరా జిల్లాలో ఉన్న రాణిఖేత్ అనే ప్రాతానికి చెందిన మధో సింగ్ మెహ్రా 24 ఏళ్ల కిందట ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో అతని కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు పెట్టారు. అయితే ఎన్ని ఏళ్లు గడిచినా అతను తిరిగి రాలేదు. దీంతో అతను చనిపోయి ఉంటాడని భావించిన కుటుంబ సభ్యులు అతనికి ప్రతి ఏడాది కర్మలు చేయడం ప్రారంభించారు.
అయితే ఇటీవలే అతను తమ గ్రామానికి సమీపంలోని పొలాల్లో కొందరికి కనిపించాడు. అతనికిప్పుడు 72 ఏళ్లు కావడంతో వృద్ధాప్యం వచ్చేసింది. అయినప్పటికీ గ్రామ వాసులు అతన్ని గుర్తించి అతన్ని ఇంటికి తీసుకువచ్చారు. అయితే కుటుంబ సభ్యులు మొదట ఆశ్చర్యం వ్యక్తం చేసినా తరువాత భయపడ్డారు. అతను చనిపోయాడని ఇన్నాళ్లూ అతనికి కర్మలు చేశారు కనుక.. దాని నుంచి విముక్తి పొందాలంటే మధో సింగ్‌కు మళ్లీ నామకరణం చేసే కార్యక్రమం నిర్వహించాలని పండితులు చెప్పారు. దీంతో వారు అతన్ని అప్పటి వరకు ఇంట్లోకి రానిచ్చేది లేదని చెబుతూ ఇంటి బయటే టెంటు వేసి ఉంచారు. త్వరలో ఆ తంతు ముగియగానే మళ్లీ అతన్ని ఇంట్లోకి తీసుకువెళ్తామని చెబుతున్నారు.
ఇక అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉండగా వారికి పెళ్లిళ్లు అయిపోయి స్థిర పడ్డారు. మధో సింగ్ అదృశ్యం అయినప్పటి నుంచి అతని భార్య విధవగానే ఉంటోంది. మధోసింగ్ మిస్సింగ్ అయినప్పుడు అతని పిల్లలు చాలా చిన్నవారు. ఇప్పుడు అతను వృద్ధుడు అయ్యాడు. పిల్లలు పెద్దగై పెళ్లి చేసుకున్నారు. దీంతో అంతా ఒక్కసారిగా మారిపోయింది. అయితే అతను ఇన్ని రోజులూ ఎక్కడ ఉన్నాడు, ఏం చేశాడు, అసలు మళ్లీ సొంత ఊరికి ఎలా వచ్చాడు ? అనే వివరాలను అతను గుర్తు పెట్టుకోలేదు. ఎవరేం అడిగినా తనకు ఏమీ గుర్తు లేదని చెబుతున్నాడు. ఏది ఏమైనా.. ఇది చాలా వింతగా అనిపిస్తోంది కదా..!