హిందువులు ప్రతి ఏడు ఎన్నో పండుగలను జరుపుకుంటారు. అయితే ఈ పండుగలు మొట్టమొదటిగా తొలి ఏకాదశి పండుగతోనే ప్రారంభం అవుతాయి. అందుకోసమే హిందూ ప్రజలు తొలి ఏకాదశినీ పెద్ద ఎత్తున జరుపుకుంటారు. సంవత్సరంలో ప్రతినెల ఏకాదశి వస్తుంది. అంటే సంవత్సరానికి 12 ఏకాదశులను జరుపుకుంటారు. కానీ వీటిలో నాలుగవ నెల ఆషాఢమాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా భావించి భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు.
ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని పిలుస్తారు. ఆషాడ మాసంలో విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్తారు అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏకాదశి రోజు విష్ణు దేవుడు శయన పాన్పుపై భక్తులకు దర్శనమిస్తాడు కనుక ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏకాదశి రోజు విష్ణు మూర్తిని భక్తిభావంతో పూజించడం వల్ల వారికి ఎలాంటి కష్టనష్టాలు ఉండవని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
తొలి ఏకాదశి రోజు ఉదయమే నిద్రలేచి విష్ణు దేవుడికి ప్రత్యేక పూజలను చేయాలి. తొలి ఏకాదశిని జరుపుకునేవారు ఉపవాస దీక్షతో పూజ చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. కేవలం పాలు, పండ్లను తీసుకొని మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు వరకు ఉపవాస దీక్షలు చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలను నిర్వహించి స్వామివారికి నైవేద్యంగా చక్కెర పొంగలిని సమర్పించాలి. అనంతరం విష్ణు నామాలను చదువుతూ పూజ చేయాలి. ఈ ఏకాదశి రోజు ఎవరి స్తోమతకు తగ్గట్టు దానధర్మాలను చేయడం వల్ల శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన తులసీ దళాలను ఈ ఏకాదశి రోజు కోయకూడదు. ఈ విధంగా తొలి ఏకాదశి పండుగ హిందూ ప్రజలు ఎంతో వేడుకగా జరుపుకుంటారు.