దేశంలో కోవిడ్ రెండో వేవ్ సృష్టించిన దారుణకాండ అంతా ఇంతా కాదు. ఎన్నో వేల మంది చనిపోయారు. అయితే రెండో వేవ్ ప్రభావం ఇంకా ముగియకముందే మూడో వేవ్ గురించి సైంటిస్టులు హెచ్చరికలు చేస్తున్నారు. ఇక తాజాగా ఎస్‌బీఐ వెల్లడించిన ఓ నివేదిక ప్రకారం మన దేశంలో కోవిడ్ మూడో వేవ్ వచ్చే నెలలోనే వస్తుందని వెల్లడైంది.
కోవిడ్-19: ది రేస్ టు ఫినిషింగ్ లైన్ పేరిటి ప్రచురించబడిన ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం ఆగస్టులో మూడో వేవ్ వస్తుందని, సెప్టెంబరులో అది తీవ్రస్థాయికి చేరుతుందని తేలింది. కరోనా రెండో వేవ్ మే 7న పతాకస్థాయికి చేరగా, మూడో వేవ్ సెప్టెంబర్‌లో దారుణంగా ఉంటుందని వెల్లడించింది. ఇక ఏప్రిల్‌లో దేశాన్ని తాకిన సెకండ్ వేవ్ మేలో గరిష్ఠానికి చేరుకుందని నివేదిక తెలిపింది. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళతోపాటు ఇతర రాష్ట్రాల్లో వేలాది కుటుంబాలపై ప్రభావం చూపిందని వివరించింది.
కాగా జూలై రెండోవారం నాటికి దేశంలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య 10 వేలకు పడిపోతుందని, అయితే ఆగస్టు రెండో వారం నుంచి కేసుల సంఖ్య మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇక సోమవారం ఒక్క రోజే దేశంలో 39,796 కరోనా కేసులు నమోదయ్యాయి. 42,352 మంది కోలుకోగా 723 మంది చనిపోయారు.