దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న విషయం విదితమే. అందులో భాగంగానే కొన్ని రాష్ట్రాల్లో నిత్యం నమోదవుతున్న కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, తమిళనాడు, చత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో రోజూ రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశం మొత్తం మీద 68,020 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
ఇక మొత్తం కేసుల్లో 84.5 శాతం వరకు కేసులు పైన తెలిపిన రాష్ట్రాల్లోనే నమోదవుతుండడం విశేషం. మహారాష్ట్రలో కొత్తగా 40,414 కేసులు నమోదు కాగా కర్ణాటకలో 3,082, పంజాబ్‌లో 2,870 కేసులు నమోదయ్యాయి. గతేడాది అక్టోబర్ 11వ తేదీ తరువాత మళ్లీ ఆ స్థాయిలో ఇప్పుడే కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. అక్టోబర్ 11వ తేదీన దేశంలో మొత్తం 74,383 కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి.
గడిచిన 6 నెలల కిందటి వరకు మొదటి వేవ్ ను భారత్ తట్టుకుని నిలబడింది. ఆ కాలంలో సెప్టెంబర్ 16వ తేదీన రికార్డు స్థాయిలో 93,617 కేసులు ఒక్క రోజే నమోదయ్యాయి. అయితే మళ్లీ అదే స్థాయికి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వీలైనంత త్వరగా అధిక స్థాయిలో ప్రజలకు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ఇవ్వడం ఒక్కటే మన ముందున్న మార్గమని నిపుణులు చెబుతున్నారు.