గత కొన్ని రోజుల క్రితం దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ తీవ్ర కలకలం రేపింది. బర్డ్ ఫ్లూ కారణంగా వందలాది పక్షులు మృత్యువాత పడ్డాయి. బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో చికెన్ ధరలు అమాంతంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం చికెన్ ధరలు క్రమంగా పుంజుకుంటున్న నేపథ్యంలో మరోసారి బర్డ్ ఫ్లూ పంజా విసురుతోంది.
హిమాచల్ ప్రదేశ్ లోని పాంగ్ డాంగ్ సరస్సు వద్ద గత రెండు వారాల వ్యవధిలో 100కు పైగా వలస పక్షులు మృత్యువాత పడ్డాయి.జనవరిలో ఈ మహమ్మారి వల్ల దాదాపు 50 వేల పక్షులు మృత్యువాత పడగా, ఫిబ్రవరిలో వ్యాధి వ్యాప్తి తగ్గినప్పటికీ ప్రస్తుతం మరోసారి విజృంభిస్తోంది. మార్చి 25 నుంచి బర్డ్ ఫ్లూ సెకండ్ వేవ్ కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రస్తుతం పక్షులలో హెచ్5ఎన్1 రకం వైరస్ రూపాంతరం చెంది కొత్త స్ట్రెయిన్ గా మారడంతో ఈ వ్యాధి మరోసారి విజృంభిస్తోందని, పక్షులలో ఈ విధంగా రెండు కొత్త స్ట్రెయిన్ లక్షణాలను గుర్తించినట్లు భోపాల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ హైసెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ శాస్త్రవేత్తలు తెలియజేశారు.