India Vs Newzealand : రాంచీ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ సునాయాసంగానే ఛేదించింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌లలో గ్లెన్ ఫిలిప్స్ 21 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 34 పరుగులు చేయగా.. డెరిల్ మిచెల్ 28 బంతుల్లో 3 ఫోర్లతో 31 పరుగులు చేశాడు. మార్టిన్ గప్తిల్ 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ 2 వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌లు తలా 1 వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 17.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 3 వికెట్లను కోల్పోయి 155 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో కేఎల్ రాహుల్ 49 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 65 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 36 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌతీ 3 వికెట్లు తీశాడు.