Nellore Chepala Pulusu : మాంసాహార ప్రియుల్లో చాలా మంది చేపలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటిని తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. చేపల్లో మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి ఎన్నో వ్యాధులను నయం చేస్తాయి. శరీరానికి కావల్సిన పోషణను అందిస్తాయి. అయితే చేపలతో చాలా మంది పులుసు చేస్తుంటారు. ఈ క్రమంలోనే నెల్లూరు చేపల పులుసు అన్నా కూడా చాలా మంది ఇష్టపడతారు. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నెల్లూరు చేపల పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
చేపలు – అరకిలో, నువ్వులనూనె – 6 టేబుల్‌స్పూన్లు, ఆవాలు – అర టీస్పూన్, జీలకర్ర – అర టీస్పూన్, మెంతులు – అర టీస్పూన్, మిరియాలు – అర టీస్పూన్, ఎండుమిర్చి – 3, కరివేపాకు – 2 రెబ్బలు, వెల్లుల్లి పాయలు – 5, అల్లం ముక్క – చిన్నది, పచ్చిమిర్చి – 4, ఉల్లిగడ్డ – 1, చింతపండు- పెద్ద నిమ్మకాయ సైజంత, టమాటాలు – 6, పసుపు – టీస్పూన్, కారం – 2 టీస్పూన్లు, ధనియాల పొడి – 3 టీస్పూన్లు, ఉప్పు – తగినంత.

నెల్లూరు చేపల పులుసును తయారు చేసే విధానం..
పాన్‌లో నువ్వుల నూనె వేసి వేడి చేయాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. మెత్తగా దంచిన అల్లం, కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు వేసి దోరగా వేయించాలి. చింతపండును రెండు కప్పుల నీటిలో 20 నిమిషాలపాటు నానబెట్టాలి. తర్వాత చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటాలను మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అందులో చింతపండు రసం, పసుపు, కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేయాలి. అవసరమైతే మరో రెండుకప్పుల నీళ్లు పోసుకోవచ్చు.
ఈ మిశ్రమాన్ని వేయించిన ఉల్లిపాయల మిశ్రమంలో పోయాలి. సన్నని సెగపై అరగంటపాటు ఉడికించాలి. గ్రేవీ ఉడికిన తర్వాత చేప ముక్కలు వేసి మరికాసేపు ఉడికించాలి. కూర ఉడుకుతున్న సమయంలోనే మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మిరియాలను వేయించి పొడి చేసుకోవాలి. ఈ మసాలపొడిని కూరలో వేసి కలియబెట్టాలి. రెండు నిమిషాల తర్వాత దించేయాలి. అంతే నోరూరించే నెల్లూరు చేపల పులుసు రెడీ అవుతుంది. దీన్ని అన్నంతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.