Hanuman Junction : మోహన్ రాజా దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం గాడ్ ఫాదర్. దాదాపు 20 సంవత్సరాల క్రితం మోహన్ రాజా దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన చిత్రం హనుమాన్ జంక్షన్. హీరో అర్జున్, జగపతిబాబు, వేణు తొట్టెంపూడి హీరోలుగా నటించిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను కామెడీ పరంగా ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇటీవల మోహన్ రాజా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ చిత్రం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
ఈ సినిమా కోసం అర్జున్, జగపతి బాబులను మొదటగా హీరోలుగా అనుకోలేదని మోహన్ రాజా చెప్పారు. తను ఈ సినిమాలో ముందుగా మోహన్ బాబు మరియు రాజశేఖర్ లను హీరోలుగా పెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. అంతేకాకుండా ఇద్దరికీ హనుమాన్ జంక్షన్ సినిమాలో నటించడానికి అడ్వాన్సులు కూడా ఇచ్చినట్టు తెలిపారు. ఆ తర్వాత మంచి స్టార్ డమ్ అండ్ డెడికేషన్ ఉన్న హీరోలు కావడంతో ఇద్దరినీ మెయింటెన్ చేయగలనా.. అనే ప్రశ్న ఆయనలో తలెత్తింది అని తెలిపారు.

ఆ సందిగ్ధంలో ఉండగా ఈ సినిమాకు ఎడిటర్ గా పని చేసిన మోహన్ రాజా తండ్రి మోహన్ ఈ సినిమాలో హీరోలుగా అర్జున్, జగపతి బాబులను ఫిక్స్ చేశారట. అలా తన తండ్రి వల్ల హనుమాన్ జంక్షన్ సినిమాలో జగపతి బాబు మరియు అర్జున్ హీరోలుగా చేశారని మోహన్ రాజా వెల్లడించారు. ప్రస్తుత మోహన్ రాజా తీస్తున్న గాడ్ ఫాదర్ చిత్రం మాస్ ఓరియంటెడ్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మళయాళంలో సూపర్ హిట్ సక్సెస్ ను అందుకున్న లూసిఫర్ చిత్రానికి తెలుగు అనువాద చిత్రం గాడ్ ఫాదర్. ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.