Rajnikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ నాలుగు దశాబ్ధాల పాటు ప్రేక్షకులని ఎంతగా అలరించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం ఇటీవల దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇచ్చి సత్కరించింది. ఇక రజనీకాంత్ అభిమానగణం ఏ రేంజ్‌లో ఉంటారో మనందరికి తెలిసిందే. తమిళనాడులో ఆయనంటే ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు.
తాజాగా ఓ అభిమాని రజనీకాంత్ కోసం తన హోటల్ లో ఒక్క రూపాయికే దోశలు పోసి విక్రయించాడు. తిరిచిలోని ఓ హోటల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. రజనీకాంత్‌పై ఉన్న అభిమానంతోనే ఇలాంటి ఆఫర్ ఇచ్చానంటున్నాడు. దీపావళి కానుకగా రజనీకాంత్ నటించిన పెద్దన్న (అన్నాతై ) సినిమా విజయవంతంగా ఆడాలని ఆకాంక్షిస్తూ ఈ పని చేసినట్లు కర్ణన్ చెప్పుకొచ్చాడు. ఆ దోశకు ‘అన్నాతై దోశ ‘ అని పేరుపెట్టాడు.
గతంలో రజనీకాంత్ కోసం ఆయన అభిమానులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు, పలు దానాలు కూడా చేశారు. రీసెంట్‌గా తలైవా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా, ఆయన కోలుకోవాలని రోజూ పూజలు చేశారు. రాను రాను అభిమానులలో రజనీకాంత్‌పై ప్రేమ, అభిమానులు పెరుగుతున్నాయే తప్ప తరగడం లేదు.