ETV Prabhakar : ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియా ప్రభావం ఎంతలా ఉందో అందరికీ తెలిసిందే. నెటిజన్లు తమకు అందులో ఏదైనా నచ్చితే ఆకాశానికెత్తేస్తారు. అదే నచ్చకపోతే మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే సినిమా రంగానికి చెందిన నటీనటులు ఎక్కువగా ఈ ట్రోలర్స్ బారిన పడుతుంటారు. అయితే తాజాగా ఈటీవీ ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ కూడా దారుణంగా ట్రోలింగ్ కు గురవుతున్నాడు.
చంద్రహాస్‌ను పరిచయం చేసిన ప్రభాకర్, ఆయన భార్య తన కుమారున్ని ఆశీర్వదించాలని ప్రేక్షకులను కోరారు. ఒకేసారి మూడు సినిమాలతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు చెప్పారు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. ప్రభాకర్, ఆయన భార్య మాట్లాడుతున్నప్పుడు పక్కనే ఉన్న చంద్రహాస్ తెగ బిల్డప్‌లు ఇచ్చాడు. స్టైల్‌గా ఉండేందుకు యత్నించాడు. దీంతో నెటిజన్లకు మంచి మీమ్ మెటీరియల్ లభించినట్లు అయింది. ఇక ఊరుకుంటారా.. వెంటనే ట్రోలింగ్ మొదలు పెట్టేశారు. ఈ క్రమంలోనే గత మూడు రోజుల నుంచి చంద్రహాస్‌పై సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. అయితే ఈ ట్రోల్స్‌పై ప్రభాకర్ స్పందించారు.

తన కుమారుడు చంద్రహాస్‌పై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించిన నటుడు ప్రభాకర్ మాట్లాడుతూ.. ఇప్పుడు తన కుమారున్ని ఎగతాళి చేసిన వారే రేపు వాడి సినిమా రిలీజ్ అయితే వాడి పెర్ఫార్మెన్స్ చూసి మెచ్చుకుంటారని అన్నారు. అయితే చంద్రహాస్ ఆటిట్యూడ్ నచ్చనందునే ట్రోల్ చేశారని.. రేపు అతను మెరుగు పడతాడని.. అప్పుడు అతన్ని అందరూ మెచ్చుకుంటారని.. అయితే ట్రోలర్స్ వల్ల తమకు మేలే జరిగిందని.. అది మంచిది కాకపోయినా తమ కుమారుడి గురించి పబ్లిసిటీ బాగా అయిందని.. ఇది తమకు మంచే చేసిందని అన్నారు. దీని వల్ల అందరికీ తన కొడుకు గురించి తెలిసిందన్నారు. రేపు వెండితెరపై తన కొడుకుని చూసి మాట్లాడాలన్నారు. అప్పుడు అతన్ని అందరూ మెచ్చుకుంటారని ప్రభాకర్ అన్నారు. దీంతో ప్రభాకర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.