Dussehra 2022 Muhurat : ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు జరుపుకునే అనేక పండుల్లో దసరా ఒకటి. అయితే ఇది అతి పెద్ద పండుగ అని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంత వాసులు దసరాను వైభవంగా నిర్వహిస్తారు. బతుకమ్మ పండుగను కూడా ఇదే సమయంలో పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఇక దేశంలో అనేక చోట్ల 9 రోజుల పాటు దుర్గామాత విగ్రహాలను పూజించి ఆ తరువాత నిమజ్జనం చేస్తారు. చివరి రోజును విజయదశమి లేదా దసరాగా జరుపుకుంటారు. ఈ 9 రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు.
ఇక దసరా పండుగ రోజు చాలా మంది కొత్త వ్యాపారాలను, పనులను ప్రారంభిస్తుంటారు. ఎందుకంటే ఆ రోజు ఏం చేసినా కలసి వస్తుందని చాలా మంది నమ్ముతారు. అదే రోజు రాముడు రావణాసురుడిపై యుద్ధం చేసి విజయం సాధించాడు. అలాగే పాండవులు కూడా యుద్ధంలో కౌరవులపై గెలుపొందారు. దీంతోపాటు దుర్గాదేవి కూడా రాక్షస సంహారం చేసింది అదే రోజు. కనుక ఆ రోజు ఎవరు ఏం చేసినా సరే.. కలసి వస్తుందని విశ్వసిస్తారు. అందుకనే దసరాను విజయాలు చేకూర్చే విజయదశమిగా జరుపుకుంటుంటారు.
ఇక ఈసారి దసరా పండుగ అక్టోబర్ 5న వచ్చింది. కానీ శుభ ముహుర్తం మాత్రం అక్టోబర్ 4 నుంచే ఉంది. అక్టోబర్ 4వ తేదీన రాత్రి 10.51 గంటల నుంచి అక్టోబర్ 5వ తేదీ రాత్రి 9.15 గంటల వరకు దసరా ముహుర్తం ఉంది. ఇక అమృత కాలం మాత్రం అక్టోబర్ 5వ తేదీన ఉదయం 11.33 గంటల నుంచి మధ్యాహ్నం 1.02 గంటల వరకు ఉంది. కనుక ఎవరైనా ఏం చేయాలన్నా సరే.. ఈ సమయంలో చేస్తే.. అంతా మంచే జరుగుతుంది.
ఇక దసరా రోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసి కుటుంబం మొత్తం తలస్నానం చేయాలి. అనంతరం దుర్గామాతకు పూజ చేయాలి. ముఖ్యంగా బెల్లం, అరటి పండ్లు, బియ్యంను పూజలో తప్పక ఉంచాలి. అనంతరం వీటిని పేదలకు లేదా బ్రాహ్మణులకు దానం చేయాలి. వారికి ఇవే కాకుండా ఏవైనా ఇతర వస్తువులు లేదా ఆహారాలు కూడా దానం చేయవచ్చు. తరువాత పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. ఇలా దసరా శుభ ముహుర్తం సమయంలో చేస్తే.. అంతా మంచే జరుగుతుంది. ఎవరైనా ఏం వ్యాపారం మొదలు పెట్టినా సరే కలసి వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. అదృష్టం కలసి వస్తుంది. ఇంట్లోని అందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తారు. కనుక దసరా రోజు ఇలా చేయడం మరిచిపోకండి.