మొదటి పార్ట్ పుష్ప ది రైజ్ తరువాత ఎంతో కాలంగా అల్లు అర్జున్ అభిమానులు పుష్ప పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. మొదటి పార్ట్ అయిన పుష్ప ది రైజ్ లో పుష్ప రాజ్ చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ కూలీగా తన ప్రయాణం మొదలుపెట్టి ఒక సిండికేట్ స్థాయినికి ఎలా ఎదిగాడు అనే విషయాన్ని దర్శకుడు సుకుమార్ ప్రేక్షకులకు చూపించారు.
ఇక రెండో భాగానికి పుష్ప ది రూల్ అనే పేరు వెల్లడించారు. పుష్ప చిత్రంతో ప్రముఖ మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ఎస్‌పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఫహద్ ఫాజిల్ నటించిన చిత్రాలు తెలుగులో డబ్ అయ్యాయి కానీ అతనికి అంతగా గుర్తింపు రాలేదు. కానీ పుష్ప చిత్రంలో ఫహద్ ఫాజిల్ నటన అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఇక ఫహద్ ఫాజిల్ వివరాల కోసం వెతుకులాట మొదలయ్యింది. ఈ వెతుకులాటలో కొన్ని కొత్త విషయాలు బయటపడ్డాయి. ఫహద్ ఫాజిల్ తండ్రి పేరు అబ్దుల్ హమీద్ మహమ్మద్ ఫాజిల్. ఈయన మలయాళ చిత్ర సీమలో ఒక పెద్ద స్టార్ డైరెక్టర్. ఎన్నో హిట్ చిత్రాలను మలయాళ చిత్ర పరిశ్రమకు అందించారు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక నటించిన చంద్రముఖి ఒరిజినల్ వెర్షన్ మణిచిత్రతళుకు మలయాళంలో మహమ్మద్ ఫాజిల్ దర్శకత్వం వహించారు.
అంతే కాదండోయ్ మహమ్మద్ ఫాజిల్ తెలుగులో కూడా ఒక చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇంతకీ ఏంటి ఆ చిత్రం అనుకుంటున్నారా.. మన కింగ్ నాగార్జున, నగ్మా హీరో హీరోయిన్లుగా కలిసి నటించిన కిల్లర్ చిత్రానికి మహమ్మద్ ఫాజిల్ దర్శకత్వం వహించారు. ఇలా ఫహాద్ ఫాజిల్ తండ్రి అంతకు ముందే తెలుగు చిత్ర పరిశ్రమకు తెలుసు. ఇప్పుడు ఫహాద్ ఫాజిల్ కూడా తెలుగు ఇండస్ట్రీకి బాగా పరిచయం అయ్యారు.