Krithi Shetty : ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయింది కృతి శెట్టి. దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన 2021లో అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీతో కృతి శెట్టికి మంచి ఫేమ్ వచ్చింది. యంగ్ కాలేజ్ గర్ల్ గా కృతి కుర్ర మనసుల్ని దోచేసింది. ఉప్పెన విజయంతో కృతికి ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆమె రెండో చిత్రం శ్యామ్ సింగరాయ్, మూడో చిత్రం బంగార్రాజు హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. దీంతో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది.
అయితే ఇప్పుడు కృతికి తిరోగమనం మొదలైనట్లు అనిపిస్తోంది. కృతి శెట్టి నటించిన ది వారియర్ మూవీ ఫ్లాప్ అయింది. రూ.10 కోట్ల నుండి రూ.15 కోట్ల నష్టాలు మిగిల్చిన ది వారియర్ టాలీవుడ్ డిజాస్టర్స్ లో ఒకటిగా చేరింది. అలాగే తాజాగా విడుదలైన మాచర్ల నియోజకవర్గం చిత్రం నెగెటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. నితిన్ హీరోగా డెబ్యూ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి విమర్శకులు దారుణమైన రేటింగ్ ఇచ్చారు.

బ్యాడ్ టాక్ నేపథ్యంలో ఓపెనింగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. మాచర్ల నియోజకవర్గం బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే అంటున్నారు. అదే జరిగితే కృతి శెట్టి వరుసగా మరో ఫ్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నట్లే. వచ్చే నెలలో సుధీర్ బాబుకి జంటగా నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి విడుదలకు సిద్ధంగా ఉంది.
ఏమాత్రం ఫామ్ లో లేని డైరెక్టర్ మోహన కృష్ణ ఇంద్రగంటి, సుధీర్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. ఆ చిత్రం కూడా ఏదైనా తేడా కొడితే కృతిశెట్టి ఖాతాలో హ్యాట్రిక్ ఫ్లాప్ లు చేరినట్లు అవుతుంది. ఇక ముందైనా కథ విషయంలో కృతి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుందో లేదో చూడాలి.