Aryan Khan : బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ కేసులో ఊరట లభించింది. ఈ కేసును పరిశోధిస్తున్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆర్యన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని.. అలాగే అతను డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు కూడా లభించలేదని.. అందుకనే ఆర్యన్‌ను ఈ కేసు నుంచి మినహాయిస్తున్నట్లు ఎన్‌సీబీ తెలియజేసింది. ఈ సందర్భంగా ఆర్యన్ తరఫున వాదించిన ప్రముఖ సుప్రీం కోర్టు క్రిమినల్ లాయర్ ముకుల్ రోహత్గి సంతోషం వ్యక్తం చేశారు.
ఆర్యన్‌ఖాన్ నిర్దోషి అని ఎన్‌సీబీ క్లీన్ చిట్ ఇవ్వడం సంతోషంగా ఉందని ముకుల్ రోహత్గి తెలిపారు. ఎన్‌సీబీ ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుందని అన్నారు. అయితే ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో 14 మందిపై మాత్రం ఎన్‌సీబీ శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేసింది. ఇక ఆర్యన్‌ఖాన్ ఈ కేసులో నిర్దోషిగా బయట పడడంతో షారూక్ నివాసం మన్నత్ వద్ద సందడి నెలకొంది.

కాగా గతేడాది అక్టోబర్ 3వ తేదీన ముంబైలో ఓ క్రూయిజ్ షిప్‌పై సమీర్ వాంఖెడె నేతృత్వంలోని ఎన్‌సీబీ బృందం దాడులు చేసింది. ఆ షిప్‌లో డ్రగ్స్ సరఫరా జరుగుతుందన్న సమాచారం మేరకు వాంఖెడె దాడులు జరిపారు. అదే షిప్ లో షారూక్ తనయుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉండడంతో అతను డ్రగ్స్ తీసుకుని ఉంటాడని.. లేదా డ్రగ్స్ సరఫరా చేసి ఉంటాడన్న అనుమానంతో అతన్ని అరెస్టు చేశారు. తరువాత ముంబై జైలులో 22 రోజుల పాటు ఆర్యన్ ఉన్నాడు. తరువాత ముకుల్ రోహత్గి బలమైన వాదనలు వినిపించి ఆర్యన్‌కు బెయిల్ వచ్చేలా చేశారు. ఇక ఇప్పుడు ఆర్యన్ ఖాన్‌కు ఈ కేసులో క్లీన్ చిట్ లభించింది.