వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆయన కుమార్తె సునీతా రెడ్డి అన్నారు. వైఎస్ వివేకా హత్య కేసు నేపథ్యంలో ఆమె శుక్రవారం ఢిల్లీలో సీబీఐ అధికారులను కలిశారు. తన తండ్రి హత్య కేసును త్వరగా దర్యాప్తు చేయాలని, దోషులను పట్టుకుని శిక్షించాలని ఆమె కోరారు. తమలాంటి వారికే న్యాయం జరగకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు.
తన తండ్రి హత్య కేసు విషయమై ఓ ఉన్నతాధికారిని కలిశానని, కానీ ఆయన ఇలాంటివన్నీ సహజమని, మరిచిపోవాలని, లేదంటే అది నా పిల్లలపై ప్రభావం చూపుతుందని అన్నారని.. ఇందుకు బాధగా ఉందని అన్నారు. తాను రాజకీయ వేత్తను, సామాజిక కార్యకర్తను కాను అని అన్నారు. తన తండ్రి హత్య కేసులో దర్యాప్తు ఇంకా ముందుకు కొనసాగకపోవడం విచారకరమన్నారు.
వివేకా హత్య జరిగి 2 ఏళ్లు అవుతుందని, అయినప్పటికీ ఇప్పటి వరకు హంతకులను పట్టుకోలేదని అన్నారు. ఓ మాజీ ముఖ్యమంత్రి సోదరుడి హత్యను ఇంత తేలిగ్గా తీసుకోవడ తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అన్నారు. ఇప్పటికైనా కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని సునీతా రెడ్డి కోరారు.