ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవడం చేత పెద్ద ఎత్తున వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండగా మరికొందరు ఈ వరదనీటిలో కొట్టుకుపోతూ మరణిస్తున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ విధంగా అధిక వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది అని చెప్పవచ్చు. అధిక వర్షం ప్రభావం కారణంగా తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో వాగు దాటుతుండగా ఓ తల్లి, తన ఇద్దరు చిన్నారులు వాగులో గల్లంతైన ఘటన చోటు చేసుకుంది.
గత రెండు మూడు రోజుల నుంచి అధిక వర్షాలు కురవడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన పిల్లలిద్దరినీ తీసుకొని రంపచోడవరంలో ఆధార్ ఈ-కేవైసీ ని పూర్తి చేసుకొని తిరిగి వస్తున్న సమయంలో బడి గుంట – ఆకుర మధ్య వాగులో గల్లంతైంది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే వాగు దాటుతూ ఉన్న గణేష్ దొర, వెట్టి వంశీ దొర అనే ఇద్దరు గిరిజన చిన్నారులు జారిపడి వాగులో గల్లంతయ్యారు.
ఈ క్రమంలోనే వారిని రక్షించబోయిన తల్లి కూడా అదే వాగులో కొట్టుకుపోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఈ క్రమంలోనే ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా కేవలం ఒక అబ్బాయి మృతదేహం మాత్రమే లభించింది. మిగిలిన చిన్నారి, తల్లి కోసం పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.