Black Rice : సహజంగా తెల్లగా ఉండే బియ్యం రకాలను చూసి ఉంటాం కానీ బ్లాక్ రైస్ మాత్రం నల్లగా ఉంటాయి. పూర్వ కాలంలో వీటిని కేవలం చక్రవర్తులు, వారి కుటుంబ సభ్యులు మాత్రమే తినేవారని ప్రతీతి. దీంతో వీటికి చక్రవర్తుల బియ్యం అని పేరు వచ్చింది. ఈ నల్ల బియ్యాన్ని తక్కువగా సాగు చేస్తారు. అంతేకాకుండా.. చాలామందికి ఈ రైస్ గురించి తెలియదు. కానీ ఈ నల్ల బియ్యంతో అనేక ప్రయోజనాలున్నాయి. ఇందులో ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ నల్ల బియ్యంతో కలిగే ప్రయోజనాలెంటో తెలుసుకుందామా..
నల్ల బియ్యం షుగర్ లెవల్స్ ను కంట్రోల్‌లో ఉంచి డయాబెటిస్ ను నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఈ బియ్యంలో కేలరీలు తక్కువగానూ ఫైబర్ ఎక్కువగానూ ఉండటం వల్ల అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది. కేరళ ఆయుర్వేదంలో నరాల బలహీనత ఉన్నవారికి ఈ బియ్యాన్ని మసాజ్ చేసేందుకు ఉపయోగిస్తారు. అలాగే అధిక రక్త పోటు సమస్య నుంచి కూడా కాపాడుతాయి. నల్ల బియ్యం మంచి రుచిని కూడా కలిగి ఉంటాయి. బ్లాక్ రైస్ లో ఉండే ఫైబర్ జీర్ణసంబంధ సమస్యలను తగ్గిస్తుంది. బ్లాక్ రైస్ లో ఆంథోసైయనిన్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.

ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వలన కడుపు నిండిన భావన కలిగి ఎక్కువసేపు ఉన్నా తొందరగా ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గటానికి అవకాశం ఉంటుంది. బ్లాక్ రైస్‌లోని యాంటీఆక్సిడెంట్లు కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తాయి. బ్లాక్ రైస్‌లో అధిక మొత్తంలో లుటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది. బ్లాక్ రైస్‌లోని విటమిన్ ఇ, కెరోటినాయిడ్‌లు కూడా కళ్లపై యూవీ రేడియేషన్‌ను తగ్గిస్తాయి. బ్లాక్ రైస్ ధర ఎక్కువైనప్పటికీ (దాదాపు రూ.300), ప్రయోజనాలు కూడా ఎక్కువే. కనుక వీటిని తింటే అనేక లాభాలను పొందవచ్చు.