Aishwarya Rajinikanth : సెలబ్రటీల విడాకులకు సంబంధించిన వార్తలను ఈ మధ్య తరచూ వింటూనే ఉన్నాం. సోషల్ మీడియాలో కూడా ఇలాంటి పుకార్లకు విపరీతమైన స్పందన రావడం జరుగుతుంది. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఇలాంటివి లేని కాలంలో అయితే ఇవన్నీ చాలా మందికి తెలిసేవి కాదు. కానీ ఇప్పుడు తరచూ ఎవరో ఒక జంట గురించిన విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.
ఇక అసలు విషయానికి వస్తే తమిళ హీరో ధనుష్ అతని భార్య ఐశ్వర్య రజనీకాంత్ లు ఇదివరకే విడిపోతున్నట్టు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరు పిల్లల తల్లిదండ్రులైన వీరు 18 సంవత్సరాల వైవాహిక జీవితం తరువాత ఇటీవలే విడాకులు తీసుకోనున్నట్టు సోషల్ మీడియాలో పోస్టులను పంచుకున్నారు. ఈ సంగతి వారి అభిమానులతోపాటు రజనీకాంత్ అభిమానులను కూడా షాక్ కి గురిచేసింది. విడిపోయిన వెంటనే తమ తమ సోషల్ అకౌంట్ల నుండి వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను తొలగించి పేర్లను కూడా మార్చేయడం జరిగింది. ఇక వారిద్దరూ కలవరని అందరూ అనుకున్నారు.

అయితే దీనికి భిన్నంగా ఈ మధ్యే వాళ్లిద్దరూ కలిసి తమ పిల్లల స్కూల్ ఫంక్షన్ లో పాల్గొనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వాళ్లిద్దరూ కలిసి దిగిన ఫోటోలు బయటికి రావడంతో అవి కూడా వైరల్ అయ్యాయి. దీంతో ఇకనైనా వాళ్లు తిరిగి కలిస్తే బాగుంటుందని అభిమానులు తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఒకానొక సందర్భంలో ధనుష్, ఐశ్వర్యలు గొడవ కూడా పడడం జరిగిందని ధనుష్ తండ్రి తెలిపారు. అయితే ఇరువురి కుటుంబాల పెద్దలు రజనీ కాంత్ సమక్షంలో కలిసి వాళ్లకి నచ్చజెప్పడం జరిగిందని వాళ్లు తిరిగి కలవబోతున్నారని తాజాగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. పెద్దల మాటకు గౌరవం ఇచ్చి వాళ్లిద్దరూ తమ విడాకుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోనున్నారని తెలిసింది. అయితే ఈ విషయంపై త్వరలో స్పష్టత రానున్నట్లు చెబుతున్నారు.