IQ : సాధారణంగా మనం పాలు, నీళ్లు ఇతర ద్రవ పదార్థాలను లీటర్లలో కొలుస్తాం. అదే ఘన పదార్థాలైతే కేజీల లెక్కన కొలుస్తాం. ఇక వాయువులైతే క్యుబిక్ మీటర్లు, సెంటీమీటర్లు, ఫీట్లలో కొలుస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.. అయితే మరి ఒక మనిషికి ఉన్న తెలివితేటలను కొలవాలంటే.. అందుకు ఏ కొలమానం వాడుతాం..? ఏంటీ.. తెలివితేటలను ఎవరైనా కొలుస్తారా..? ఎవరికైనా ఉండే తెలివిని కేజీలు, లీటర్ల లెక్కన కొలవడం సాధ్యమవుతుందా..? అని మీరు సందేహించవచ్చు. కానీ తెలివితేటలను కొలవవచ్చు. అయితే అది కేజీలు, లీటర్లలోకాదు.. వేరే పద్ధతిలో.. అదెలాగంటే..
ఎవరైనా ఒక వ్యక్తికి తెలివితేటలు ఎంత ఉన్నాయి.. అని మనకు తెలియజేసే సాధనం ఐక్యూ. దీన్నే ఇంటెలిజెన్స్ కోషెంట్ (Intelligence Quotient) అంటారు. అంటే ఐక్యూ సంఖ్య ఎంత పెద్దదైతే వారికి అన్ని ఎక్కువ తెలివితేటలు ఉంటాయన్నమాట. తెలివితేటలకు కొలమానమే ఐక్యూ. ఒక మనిషికి ఉండే ఐక్యూని బట్టి అతని తెలివితేటలను నిర్దారిస్తారు. అయితే ఐక్యూను ఎలా కొలుస్తారు..? అంటే..
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఐక్యూని కొలిచేందుకు రక రకాల పద్ధతులు వాడుతున్నారు. వాటిల్లో ముఖ్యమైంది వెక్స్లర్ టెస్టు. ఇందులో మనిషి శబ్ద గ్రహణ శక్తి, జ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకునే శక్తి, జ్ఞాపకశక్తి, ప్రాసెసింగ్ స్పీడ్ (ఒక ప్రశ్నకు ఎంత వేగంగా సమాధానం చెప్పగలరనే శక్తి) తదితర అన్ని పరిజ్ఞానాలను కొలుస్తారు. వాటిల్లో సాధించే స్కోరును బట్టి చివరకు ఐక్యూని నిర్ణయిస్తారు. అయితే స్టాన్ఫర్డ్ బినెట్ స్కేల్ అనే మరో ఐక్యూ టెస్ట్ కూడా ఉంది. ఇందులో దృశ్య ప్రాదేశిక ప్రాసెసింగ్ వంటి నూతన అంశాల్లో కూడా ఐక్యూను కొలుస్తారు.
సాధారణంగా ఐక్యూ టెస్టులో ఒక వ్యక్తికి ఉండే గణిత శాస్త్ర సామర్థ్యం, పదజాలం ప్రతిభ వంటి అంశాలకు చెందిన ప్రశ్నలను ఇస్తారు. వాటిని ఆ వ్యక్తులు నిర్ణీత కాలంలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఇవే కాకుండా పలు ఇతర ఐక్యూ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నప్పటికీ.. ఏవీ కచ్చితమైన ఫలితాలను ఇస్తాయన్న గ్యారంటీ లేదు. అందుకనే ఐక్యూ టెస్టులకు అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కాకపోతే పలు మానసిక వ్యాధులతో బాధపడేవారి ఐక్యూ ఎంత ఉంది అని తెలుసుకునేందుకు ఈ టెస్టులు ఉపయోగపడతాయని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో వారి స్థితిని అంచనా వేసి తగిన విధంగా చికిత్స చేసేందుకు వీలు కలుగుతుందని వారు అంటున్నారు.
అయితే ప్రముఖ సైంటిస్టు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఐక్యూ 160 ఉంటుందనే ఒక వాదన బలంగా ప్రచారంలో ఉంది. నిజానికి ఐన్‌స్టీన్ కాలంలో ఐక్యూను కొలిచే పద్ధతులు అప్పటికి ఇంకా అందుబాటులోకి రాలేదు. మరలాంటప్పుడు ఆయన ఐక్యూ 160 ఎలా ఉంటుంది..? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ ఐక్యూ అనేది నిజంగానే ఒక వ్యక్తి తెలివితేటలను కచ్చితంగా తెలియజేస్తుందని చాలా మంది నమ్మకం. అయితే ఐక్యూ వల్ల తెలివిలేని వారిని చిన్న చూపు చూస్తారని కూడా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఈ విషయంపై మరింత లోతుగా పరిశోధనలు జరగాల్సిందేనని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా.. ఐక్యూ వల్ల ఒక మనిషికి ఉన్న తెలివితేటలను అంచనా వేయడం అంత సులభమేమీ కాదని మెజారిటీ సైంటిస్టుల అభిప్రాయం. ఇదీ.. ఐక్యూ కథాకమామీషు..!