Walking : చాలా మంది భోజనం చేసిన తరువాత వెంటనే నిద్రిస్తుంటారు. ఇంకొందరు టీ, కాఫీ తాగుతారు. అయితే ఇవి ఆరోగ్యకరమైన విధానాలు అయితే కావని వైద్య నిపుణులు చెబుతున్నారు. మీ జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండాలంటే మీరు భోజనం చేశాక తప్పనిసరిగా తేలికపాటి వాకింగ్ చేయాలి. మీరు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా రోజూ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. తిన్న తరువాత చిన్నపాటి దూరం నడవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
భోజనం చేసిన అనంతరం చిన్నపాటి దూరం వరకు తేలిగ్గా నడవడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. జీర్ణశక్తి మెరుగు పడుతుంది. జీర్ణాశయంలో ఉండే కండరాలు బలపడతాయి. పేగులకు ఆరోగ్యం కలుగుతుంది. పేగులలో ఆహారం సులభంగా కదులుతుంది. దీంతో గుండెల్లో మంట, మలబద్దకం, కడుపు ఉబ్బరం, అసిడిటీ, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు తగ్గుతాయి. భోజనం చేసిన తరువాత వాకింగ్ చేయడం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. దీంతో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి. ఫలితంగా డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
తిన్న తరువాత వాకింగ్ చేస్తే క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఇది బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయ పడుతుంది. వాకింగ్ వల్ల మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో శక్తిస్థాయిలు పెరుగుతాయి. కండరాలు, ఎముకలు దృఢంగా మారుతాయి. తిన్న తరువాత వాకింగ్ చేయడం వల్ల హైబీపీ తగ్గుతుంది. రాత్రి పూట భోజనం అనంతరం కేవలం 5 నుంచి 10 నిమిషాల పాటు వాకింగ్ చేసినా చాలు ఈ ప్రయోజనాలను పొందవచ్చు. దీంతో నిద్ర కూడా చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడతారు. అయితే తిన్న వెంటనే కాకుండా 10 నిమిషాలు ఆగాక వాకింగ్ చేయాలి. దీంతో మరిన్ని లాభాలను పొందవచ్చు.