How Many Steps : కఠినతరమైన వ్యాయామాలు చేయలేని వారి కోసం అందుబాటులో ఉన్న సరళతరమైన వ్యాయామం ఒక్కటే.. అదే వాకింగ్.. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారైనా సరే.. వాకింగ్ చేయవచ్చు. దీంతో శరీరంపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. కీళ్లనొప్పులు ఉన్నవారు కూడా వాకింగ్ ఎలాంటి అభ్యంతరం లేకుండా చాలా సునాయాసంగా చేయవచ్చు. అయితే నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో వ్యాయామం కాదు కదా.. కనీసం వాకింగ్ చేసేందుకు కూడా వీలుండడం లేదు. కానీ నిత్యం ఏదో ఒక సమయంలో వాకింగ్ కచ్చితంగా చేయాలి. దీంతో కొంత వరకైనా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
నిత్యం వాకింగ్ చేయడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అధిక బరువు తగ్గుతారు, హైబీపీ, డయాబెటిస్ అదుపులో ఉంటాయి. పొట్ట తగ్గుతుంది. అయితే.. నిత్యం ఎంత సేపు వాకింగ్ చేస్తే మంచిదనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీంతో అసలు వాకింగ్ చేయడమే మానేస్తుంటారు. అయితే డాక్టర్లు చెబుతున్న ప్రకారం నిత్యం మనం 10వేల అడుగుల దూరం నడవాల్సి ఉంటుంది. అంత నడవలేకపోతే కనీసం 5వేల అడుగులు అయినా నడవాలని వైద్యులు సూచిస్తున్నారు.
10వేల అడుగుల నడక సరే.. కానీ అన్ని వేల అడుగుల దూరం నడిచినట్లు మనకు ఎలా తెలుస్తుంది..? అంటే.. అందుకు మనకు మార్కెట్‌లో పెడోమీటర్లు అందుబాటులో ఉన్నాయి. లేదా.. స్మార్ట్‌ఫోన్‌లో పెడోమీటర్ యాప్ వేసుకున్నా చాలు.. మీరు నడిచినప్పుడు మీ వెంట ఫోన్‌ను ఉంచుకోండి. అందులో పెడో మీటర్ యాప్‌ను ఆన్ చేయండి చాలు.. అది మీరు ఎన్ని అడుగుల దూరం నడిచారో చాలా సులభంగా చెప్పేస్తుంది. అదీ కుదరక పోతే మనకు మార్కెట్‌లో ఫిట్‌నెస్ ట్రాకర్లు, స్మార్ట్‌బ్యాండ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లోనూ పెడోమీటర్ ఉంటుంది. దీనివల్ల వాకింగ్ చేసినప్పుడు వాటిని చేతికి ధరిస్తే.. వాటిలో ఉండే పెడోమీటర్ మనం నడిచిన దూరాన్ని ఇట్టే చెప్పేస్తుంది. దీంతో మనం ఎన్ని అడుగులు నడిచామో వాటిలో చూసుకుని ఆ మేర 5వేలు లేదా 10వేల అడుగుల కోటాను రోజూ పూర్తి చేయవచ్చు. కనుక ఇంకెందుకాలస్యం.. ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ 10వేల అడుగులు నడవడం ప్రారంభించండిక..!