Gooseberry Juice In Summer : ఉసిరికాయ గురించి అందరికీ తెలిసిందే. దీన్నే ఇండియన్ గూస్బెర్రీ అని కూడా పిలుస్తారు. ఈ కాయల్లో అనేక రకాల అవసరమైన పోషకాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీన్నే ఆయుర్వేదంలో ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతూ వస్తున్నారు. దీన్ని మ్యాజికల్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. ఈ కాయలలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. జీర్ణశక్తి మెరుగు పడుతుంది. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కనుక ఉసిరికాయలను రోజూ తింటే ఎన్నో లాభాలను పొందవచ్చు. అయితే వేసవిలో ఈ కాయలకు చెందిన రసాన్ని రోజూ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవిలో మనకు ఉసిరికాయలు లభించవు. కానీ ఉసిరికాయల రసం మార్కెట్లో లభిస్తుంది. కనుక ఆ రసాన్ని కొని తెచ్చి తాగవచ్చు. వేసవిలో ఉసిరికాయల రసం తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. దీంతో ఎండదెబ్బ బారిన పడకుండా ఉంటారు. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. వేడి తగ్గుతుంది. బయటకు వెళ్లి వచ్చిన వారు ఉసిరి రసం తాగితే త్వరగా శరీరం చల్లగా మారుతుంది. అయితే ఉసిరికాయ రసాన్ని నేరుగా తాగలేని వారు దాన్ని కింద చెప్పిన విధంగా తీసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

ఉసిరికాయల రసాన్ని నేరుగా తాగలేకపోతే దాన్ని మీరు తయారు చేసుకునే స్మూతీలలో కలిపి తీసుకోవచ్చు. అలాగే వెజిటబుల్ లేదా ఫ్రూట్ సలాడ్‌పై చల్లి తినవచ్చు. లేదంటే ఉడకబెట్టిన పల్లీలు, ఆలుగడ్డలు, పచ్చి ఉల్లిపాయలు, పచ్చి టమాటాలపై చల్లి కూడా తీసుకోవచ్చు. లేదా ఉసిరికాయల రసాన్ని చల్లని నీటిలో కలిపి తీసుకోవచ్చు. పెరుగు లేదా మజ్జిగలో కలిపి తాగవచ్చు. ఇలా ఉసిరికాయల రసాన్ని వేసవిలో తీసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.