Choles Masala : చోలే మసాలా కర్రీ.. కాబులీ శనగలతో చేసే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ, పూరీ, రోటీ, పుల్కా వంటి వాటితో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. అయితే చాలా మంది దీనిని తయారు చేయడం సమయంతో కూడుకున్న పని అని భావిస్తారు. కానీ కింద చెప్పిన విధంగా చేయడం వల్ల చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా ఈ కర్రీని తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్, మొదటిసారి చేసే వారు అలాగే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చాలా సులభంగా ఈ కర్రీని తయారు చేసి తీసుకోవచ్చు. తక్కువ సమయంలో, రుచిగా చోలే మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చోలే మసాలా కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
కాబులీ శనగలు – ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, వెల్లుల్లి రెమ్మలు – 10, అల్లం – 2 ఇంచుల ముక్క, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 4, యాలకులు – 3, నూనె – 3 లేదా 4 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకులు – 2, జీలకర్ర – ఒక టీ స్పూన్, టమాట ముక్కలు – ఒక కప్పు, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 లేదా 3 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, చోలే మసాలా -ఒక టీ స్పూన్, నీళ్లు – 2 కప్పులు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కసూరిమెంతి – అర టీ స్పూన్.

చోలే మసాలా కూర తయారీ విధానం..
ముందుగా శనగలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. శనగలు నానిన తరువాత వీటిని మరోసారి కడిగి పక్కకు ఉంచాలి. తరువాత జార్ లో ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే టమాటాలను కూడా పేస్ట్ గా చేసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, బిర్యానీ ఆకులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించిన తరువాత టమాట పేస్ట్ ను కూడా వేసి వేయించాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, చోలే మసాలా వేసి అర నిమిషంపాటు వేయించాలి.
తరువాత తెల్ల శనగలు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించిన తరువాత మూత తీసి నీళ్లు పోసి కలపాలి. తరువాత కుక్కర్ మూత పెట్టి 7 నుండి 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. శనగలు మెత్తగా ఉడకకపోతే మరో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించవచ్చు. కుక్కర్ ఆవిరి పోయిన తరువాత మూత తీసి అందులో కొత్తిమీర, కసూరిమెంతి వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చోలే మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా రుచిగా, సులభంగా, తక్కువ సమయంలో చోలే మసాలా కర్రీని తయారు చేసి తీసుకోవచ్చు.