Betel Leaves Health Benefits : తమలపాకులు అనగానే చాలా మందికి కిళ్లీ దుకాణాల్లో వేసుకునే కిళ్లీయే గుర్తుకు వస్తుంది. కానీ వాస్తవానికి కిళ్లీ ఆరోగ్యానికి హానికరం. అయితే తమలపాకులను నేరుగా అలాగే తింటేనే ఆరోగ్యం కలుగుతుంది. తమలపాకులను హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఎవరి ఇంటికి అయినా శుభకార్యం నిమిత్తం వెళితే తాంబూలం రూపంలో తమలపాకులను ఇస్తారు. ఇక తమలపాకు మొక్కను ఇంట్లో పెంచితే వాస్తు పరంగా ఎన్నో లాభాలను అందిస్తుంది. అయితే తమలపాకులతో మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. తమలపాకుల వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
తమలపాకులను రోజూ నమలడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది. దంత క్షయం, దంతాలపై పాచి, గార, పుచ్చు పళ్లు, దంతాల నొప్పి సమస్యలు ఉన్నవారు రోజూ తమలపాకులను నమలడం వల్ల ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. దీంతో దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయి. నోరు ఆరోగ్యంగా ఉంటుంది. ఇక తమలపాకులను నమలడం వల్ల జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. వీటిల్లో కార్మినేటివ్, ఇంటెస్టైనల్, యాంటీ ఫ్లాటులెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల జీర్ణశక్తిని మెరుగు పరుస్తాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. ఈ ఆకులను నమలడం వల్ల మెటబాలిజం పెరుగుతుందని, దీంతో మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరరీం సరిగ్గా శోషించుకుంటుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది.

డయాబెటిస్ ఉన్నవారికి తమలపాకులు ఒక వరమనే చెప్పవచ్చు. రోజూ భోజనం చేసిన అనంతరం ఒక తమలపాకును నేరుగా అలాగే నమిలితే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. తమలపాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి గాయాలు, పుండ్లను త్వరగా మానేలా చేయడంలో సహకరిస్తాయి. తమలపాకుల్లో ఉండే ఫైటోకెమికల్స్ పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి. ఈ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. దీంతో క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు.
తమలపాకుల్లో యాంటీ బయోటిక్ గుణాలు ఉంటాయి. ఈ ఆకులను నమిలితే ప్లీహం తగ్గుతుంది. దీంతో దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే జలుబు, ఛాతి, ముక్కు పట్టేయడం, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి కూడా రిలీఫ్ వస్తుంది. ఈ ఆకులలో అరోమాటిక్ ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మూడ్ ను నియంత్రించడంలో సహకరిస్తాయి. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. రాత్రి భోజనం అనంతరం ఒక తమలపాకును నమిలితే మానసిక ప్రశాంతత కలిగి చక్కని నిద్ర కూడా వస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుక తమలపాకులు కనిపిస్తే ఈసారి విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకోండి. వీటితో అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.