Bathukamma Songs Lyrics Telugu : బతుకమ్మ పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. బతుకమ్మ పండుగను దసరా నవరాత్రుల సమయంలో, దేశవ్యాప్తంగా దుర్గాదేవిని తొమ్మిది రోజులు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి, ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఒక్క తెలంగాణలో మాత్రం, దీనికి భిన్నంగా పూజలు చేస్తూ ఉంటారు. నవరాత్రులు వేళ తెలంగాణలో, బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకుంటుంటారు. తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ పండుగ చిహ్నం అని చెప్పొచ్చు. బతుకమ్మ పండుగ చేసినప్పుడు, వివిధ పాటలని కూడా పాడుతూ ఉంటారు. బతుకమ్మ పండుగ సమయంలో పాడుకోవాల్సిన పాటలను, మీకోసం తీసుకు వచ్చాము.
తెలంగాణ పల్లెల్లో బతుకమ్మ అనేది ఒక సంబరం. ప్రకృతి పండుగ ఇది. ఒకప్పుడు బతుకమ్మ ఆడుతూ, ఆడపిల్లలు పాటలు పాడేవారు. ఆ పాటలు ఈ తరం వాళ్లకి తెలియదు. అయితే, మన ముందు తరాలు పాడిన పాటల్లో కొన్ని మాత్రమే ఇప్పటిదాకా చేరుకున్నాయి. చెప్పాలంటే, ఈ పాటల్ని పాడడం చాలామంది మానేశారు. ఇక, ఈరోజు మీకు ఒక పాటని మేము తీసుకు వచ్చాము. మరి ఈ పాటని బతుకమ్మ పండుగ సందర్భంగా పాడేసుకోండి.

కోసలాధీశుండు ఉయ్యాలో.. దశరథ రాముండు ఉయ్యాలో.. కొండ కోనలు దాటి ఉయ్యాలో..
వేటకే బోయెను ఉయ్యాలో..
అడవిలో దిరిగెను ఉయ్యాలో.. అటు ఇటు జూచెను ఉయ్యాలో.. చెట్టు గుబురుల చాటు ఉయ్యాలో.. చెరువొకటి కనిపించే ఉయ్యాలో..
శబ్దమేదో వినెను ఉయ్యాలో.. శరమును సంధించే ఉయ్యాలో.. జంతువేదో జచ్చే ఉయ్యాలో..
అనుకొని సాగెను ఉయ్యాలో..
చెంతకు చేరగా ఉయ్యాలో.. చిత్తమే కుంగెను ఉయ్యాలో.. కుండలో నీళ్లును ఉయ్యాలో..
తీసుపో వచ్చిన ఉయ్యాలో..
బాలుని గుండెలో ఉయ్యాలో.. బాణమే గుచ్చెను ఉయ్యాలో.. ఎవ్వరు నువ్వనె ఉయ్యాలో..
ఏడ్పుతో రాజు ఉయ్యాలో..
శ్రవణుడు నేననె ఉయ్యాలో.. చచ్చేటి బాలుడు ఉయ్యాలో.. తప్పు జరిగెనంచు ఉయ్యాలో..
తపియించెను రాజు ఉయ్యాలో..
చావు బతుకుల బాలుడయ్యే ఉయ్యాలో.. సాయమె కోరెను ఉయ్యాలో.. నా తల్లిదండ్రుల ఉయ్యాలో.. దాహంతో ఉండిరి ఉయ్యాలో..
ఈ నీళ్లు గొనిపోయి ఉయ్యాలో.. ఇచ్చి రమ్మనె ఉయ్యాలో.. ఆ నీటితో రాజు ఉయ్యాలో..
అడవంతా వెదికె ఉయ్యాలో..
ఒకచోట జూచెను ఉయ్యాలో..ఒణికేటి దంపతుల ఉయ్యాలో.. కళ్లయిన లేవాయె ఉయ్యాలో..
కాళ్లయిన కదలవు ఉయ్యాలో..
వృద్ధ దంపతుల జేరి ఉయ్యాలో.. వేదన చెందుతూ ఉయ్యాలో.. సాష్టంగ పడె రాజు ఉయ్యాలో.. సంగతి జెప్పెను ఉయ్యాలో..
పలుకు విన్నంతనే ఉయ్యాలో.. పాపమా వృద్ధులు ఉయ్యాలో.. శాపాలు బెట్టిరి ఉయ్యాలో..
చాలించిరి తనువులు ఉయ్యాలో..
శాపమే ఫలియించి ఉయ్యాలో.. జరిగె రామాయణం ఉయ్యాలో.. లోక కల్యాణమాయె ఉయ్యాలో లోకమే మెచ్చెను ఉయ్యాలో……