Avocado : అవకాడోలను ఒకప్పుడు చాలా ఖరీదైన పండుగా భావించి చాలా మంది వాటిని దూరంగా ఉంచేవారు. కానీ ఇప్పుడలా కాదు. అందరిలోనూ నెమ్మదిగా మార్పు వస్తోంది. దీంతో అవకాడోలను కూడా ఇప్పుడు చాలా మంది తింటున్నారు. వీటిని చాలా రెస్టారెంట్లు తమ తమ డిషెస్‌లో వేసి వండుతున్నాయి. అలాగే వీటిని సలాడ్స్, స్మూతీలు, డోనట్స్, శాండ్ విచ్‌లు వంటి ఆహార పదార్థాలతోనూ చాలా మంది కలిపి తింటున్నారు. అయితే అవకాడోలను నిత్యం మనం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. అవకాడోలలో మన ఆరోగ్యానికి ఉపయోగపడే మంచి కొవ్వు (హెచ్‌డీఎల్) ఉంటుంది. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అలాగే పొటాషియం, ల్యూటేన్, ఫోలేట్ తదితర పోషకాలు కూడా అవకాడోల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి పలు జబ్బులు రాకుండా మనల్ని రక్షిస్తాయి. అలాగే అవకాడాల్లో దాదాపుగా అన్ని రకాల బి విటమిన్లు ఉంటాయి. ఇవి మనల్ని వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.
అవకాడోలలో ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నిషియం, జింక్, విటమిన్ సి, ఎ, ఇ, కె లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది. అలాగే అవకాడోలను తినడం వల్ల అధిక బరువు తగ్గుతారు. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మధుమేహం ఉన్నవారు అవకాడోలను తినడం మంచిది. దీంతో వారి షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. అవకాడోలలో ఉండే విటమిన్ ఎ, కెరోటినాయిడ్స్ కంటి చూపును మెరుగు పరుస్తాయి. కళ్లలో శుక్లాలు రాకుండా చూస్తాయి. కళ్లలో మచ్చలు రాకుండా ఉంటాయి. అలాగే పలు క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. అవకాడోలను తినడం వల్ల మానసిక సమస్యల నుంచి బయట పడవచ్చని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అవకాడోలను తింటే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటివి తగ్గుతాయట. అంతేకాదు, మూడ్ కూడా మారుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు అవకాడోలను తింటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
అవకాడోలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కనుక జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా అసిడిటీ, గ్యాస్, మలబద్దకం రాకుండా ఉంటాయి. ఆ సమస్యలతో బాధపడేవారు అవకాడోలను తింటే ప్రయోజనం ఉంటుంది. అలాగే అవకాడోలలో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు మన జీర్ణాశయంలో ఉండే బాక్టీరియా, వైరస్ తదితర క్రిములను నాశనం చేస్తాయి.