8 Mistakes : నిత్యం ఉదయం నిద్ర లేవగానే చాలా మంది చాలా పనులు చేస్తారు. కొందరు బెడ్ కాఫీ లేదా టీతో ఉదయాన్ని ఆరంభిస్తే కొందరు లేవగానే ఫోన్ తీసుకుని తమకు వచ్చిన మెయిల్స్ చెక్ చేస్తారు. సోషల్ యాప్స్‌లో పోస్టులను చూస్తారు. తమ పోస్టులకు వచ్చిన కామెంట్లు, లైక్‌లు లెక్కిస్తారు. ఇక మరికొందరు అయితే స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో మునిగిపోతారు. అయితే నిజానికి ఇవేవీ కూడా మంచి అలవాట్లు కాదు. కానీ నిత్యం వీటిని చాలా మంది పాటిస్తుంటారు. అయితే ఇవే కాకుండా ఉదయాన్నే చాలా మంది పాటించే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. వాటిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది ఉదయం స్నానం చేస్తారు కానీ కొందరు చేయరు. సాయంత్రం చేస్తారు. కానీ అలా ఉండరాదు. కచ్చితంగా ఉదయాన్నే స్నానం చేయాలి. సాయంత్రం మీ ఇష్టం. కానీ ఉదయం స్నానం చేయడం మాత్రం మరువరాదు. దీంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. కొత్త ఐడియాలు వస్తాయి. పనిలో యాక్టివ్‌గా ఉంటారు. రోజంతా ఉల్లాసంగా ఉంటారు. చాలా మంది ఉదయాన్నే వేడి నీటి స్నానం చేస్తారు. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే వేడి నీరు శరీరానికి రిలాక్సేషన్ ఇస్తుంది. దీంతో ఆఫీస్‌లో చురుగ్గా ఉండలేరు. నిద్ర వస్తుంది.
కనుక ఉదయం వేడి నీటి స్నానం చేయరాదు. చన్నీళ్లు చేస్తేనే మంది. దీని వల్ల చర్మం పొడిగా మారకుండా ఉంటుంది. మెదడు యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే రోజూ ఉదయాన్నే చన్నీళ్ల స్నానం చేస్తే ఏడాదికి 4 కిలోల వరకు బరువు తగ్గుతారని పరిశోధనలు చెబుతున్నాయి. కనుక ఉదయం పూట ఎవరైనా చన్నీళ్ల స్నానమే చేయాలి. అవసరం అనుకుంటే సాయంత్రం వేడి నీళ్లతో స్నానం చేయవచ్చు. ఎలాగూ అప్పుడు పనేమీ ఉండదు. రాత్రవుతుంది, పడుకుంటారు. కనుక అప్పుడు వేడి నీటి స్నానం చేసినా ఏమీ కాదు.
నేటి తరుణంలో చాలా మందిపై సోషల్ మీడియా ప్రభావం పడుతోంది. ఉదయం నిద్ర లేవగానే బెడ్ మీదనే ఉండి ఫోన్‌ను ఓపెన్ చేసి ముందుగా సోషల్ మీడియాలో విహరిస్తారు. ఎవరెవరు ఏమేం పోస్టులు పెట్టారు, కామెంట్లు ఏం చేశారు, వైరల్ న్యూస్ ఏం వచ్చింది.. తదితర అంశాలను ఫోన్లలో చెక్ చేసి గానీ బెడ్ మీద నుంచి లేవరు. అయితే ఇలా చేయకూడదు. దానికి బదులుగా ఉదయం నిద్ర లేవగానే ఉత్సాహాన్నిచ్చే సంగీతం వినడం, ఇంట్లోని కుటుంబ సభ్యులతో గడపడం, మీకు నచ్చిన బ్రేక్‌ఫాస్ట్ చేసుకుని తినడం వంటి పనులు చేస్తే యాక్టివ్‌గా ఉంటారు. రోజు మొత్తానికి కావల్సిన యాక్టివ్నెస్ ఇలా లభిస్తుంది.
మనకు అనేక రకాల రంగు రంగుల దుస్తులు ఉంటాయి. దీంతో రోజూ ఏ డ్రెస్ వేసుకోవాలా అని అందుకోసం టైం వేస్ట్ చేస్తుంటాం. అయితే అలా కాకుండా ఒకే రంగుకి చెందిన దుస్తులను రోజూ వేసుకుంటే మంచిది. దీంతో ఏం డ్రెస్ వేసుకోవాలి అని టైం వేస్ట్ చేసే అవకాశం ఉండదు. రోజూ ఒకే రంగు దుస్తులు వేసుకుంటారు కనుక వాటికి పెద్దగా డబ్బులు కూడా వెచ్చించరు. దీంతో టైం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. చాలా మంది ప్రముఖులు మనకు రోజూ ఒకే దుస్తుల్లో కనిపించడానికి వెనుక ఉన్న కారణం ఇదే.
ఉదయాన్నే ఫ్యాట్స్, ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. వీటి వల్ల శక్తి బాగా వస్తుంది. రోజు మొత్తం యాక్టివ్‌గా ఉంటారు. అలా కాకుండా పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తింటే శరీరంలో గ్లూకోజ్ లెవల్స్ పెరిగి ఇన్సులిన్ ఎక్కువవుతుంది. అది తగ్గుముఖం పట్టే సందర్భంలో ఆకలి బాగా వేస్తుంది. నీరసంగా మారుతారు. కనుక ఉదయం ఫ్యాట్స్, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తింటే మంచిది. దీంతో అవి అంత త్వరగా జీర్ణం కావు, కనుక త్వరగా ఆకలి వేయదు. దీనికి తోడు వాటి ద్వారా అందే శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది రోజు మొత్తానికి కావల్సిన యాక్టివ్‌నెస్‌ను ఇస్తుంది.
రోజు మొత్తంలో ఆహారం ఎప్పుడు తీసుకున్నా ఆహారం తిన్నాక ఒక గ్లాస్ నీటితో నోటిని పుక్కిలించి మరీ కడుక్కోవాలి. దీంతో ఆహార పదార్థాల్లో ఉండే కెమికల్స్ ప్రభావం దంతాలు, నోటిపై తక్కువగా ఉంటుంది. దీంతో దంతాలు సంరక్షింపబడతాయి. నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది. అలాగే రోజూ రెండు సార్లు బ్రష్ చేయాలి. రాత్రి పూట తిన్నాక 30 నిమిషాలు ఆగిన తరువాత బ్రషింగ్ చేయాలి.
చాలా మంది ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో కాఫీ తాగుతారు. కానీ అలా చేయరాదు. ఖాళీ కడుపుతో కాఫీ తాగితే గ్యాస్, అసిడిటీ సమస్యలు పెరుగుతాయి. కనుక ఉదయం నిద్ర లేచాక కాఫీ తాగేందుకు కనీసం 4 గంటల పాటు వేచి ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఆ తరువాతే కాఫీ తాగాలని అంటున్నారు.
చాలా మంది ఉదయం నిద్ర లేచాక బెడ్‌ను సర్దరు. అలాగే ఉంచుతారు. బెడ్‌పై దిండ్లు, బెడ్ షీట్లు అలాగే చిందవందరగా ఉంటాయి. ఇలా ఉండడం వల్ల మన శరీరంలో ఉండే తేమ బెడ్షీట్లు, దిండ్ల నుంచి అంత త్వరగా ఆవిరి కాదు. దీంతో వాటిపై బాక్టీరియా చేరేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఉదయం నిద్ర లేవగానే బెడ్‌ను నీట్‌గా సర్దాలి. బెడ్షీట్లు, దిండ్లను సర్దుకోవాలి. వాటిని బెడ్‌పై చిందర వందరగా వేయరాదు.