సాధారణంగా మనం వేరుశెనగ బర్ఫీ, నువ్వుల బర్ఫీ లను తినే ఉంటాం. అయితే ఈ సారి కొంచెం భిన్నంగా ఆలుతో బర్ఫీ ట్రై చేయండి. మరి ఎంతో రుచికరమైన ఆలూ బర్ఫీ ఏవిధంగా తయారు చేయాలి అనుకుంటున్నారా.. ఇంకెందుకు ఆలస్యం ఆలు బర్ఫీ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
*బంగాళదుంపలు 4
*చిక్కని పాలు అర లీటర్
*జీడిపప్పు, కిస్మిస్, బాదం కొద్ది పరిమాణంలో
*కొబ్బరి తురుము రెండు కప్పులు
*పంచదార రెండు కప్పులు
*ఏలకులు 5
*నెయ్యి కొద్దిగా
తయారీ విధానం
ముందుగా బంగాళదుంపలను శుభ్రం చేసి వాటిని కుక్కర్లో బాగా ఉడికించుకోవాలి. ఉడికిన బంగాళదుంపను తొక్క తీసి వాటిని మెత్తగా చిదిమి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక గిన్నెలో పాలు పోసి బాగా మరిగించాలి. ఈ క్రమంలోనే స్టవ్ మీద బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కొబ్బరి తురుమును పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తరువాత మరుగుతున్న పాలలోకి వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుము, బంగాళాదుంప గుజ్జును వేసి కలపాలి. ఈ మిశ్రమంలోకి కొద్ది కొద్దిగా పంచదార వేస్తూ ఎక్కడ ఉండలు లేకుండా కలపాలి. ఈ విధంగా మిశ్రమం మొత్తం గట్టి పడుతున్న సమయంలో దీనిలోకి ఏలకులపొడి, ముందుగా వేయించి పెట్టుకున్న జీడి పప్పు, బాదం, కిస్మిస్ వేసి కలపాలి. తరువాత ఒక పొడవాటి పళ్ళెం తీసుకుని పళ్లెం మొత్తం నెయ్యిని రాసి మిశ్రమం మొత్తం దానిలో వేయాలి.ఈ మిశ్రమం చల్లబడిన తర్వాత మనకు ఏ విధమైనటువంటి ఆకారం కావాలో అలా కట్ చేసుకొని తినవచ్చు.