బిరియాని పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరుతాయి. బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అయితే ప్రస్తుతం వివిధ రకాల బిర్యానీలు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ రోజు మనం రొయ్యల బిర్యానీ ఏవిధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
*బాస్మతి బియ్యం- ఒక కేజీ
*రొయ్యలు- కేజీన్నర
*పెరుగు- అర కప్పు
*నిమ్మ కాయ ఒకటి
*కారంపొడి- రెండు టేబుల్ స్పూన్లు
*అల్లం వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్
*ఉప్పు- తగినంత
*గరంమసాలా- టేబుల్ స్పూన్
*నూనె
*వేగించిన ఉల్లి ముక్కలు రెండు కప్పులు
*కొత్తిమీర తరుగు -కొద్దిగా
*పుదీనా తరుగు – రెండు టేబుల్ స్పూన్లు
*బిర్యానీ దినుసులు
*నీళ్లు సరిపడినంత
తయారీ విధానం
ముందుగా ఒక గిన్నె తీసుకొని రొయ్యలను బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఈ రొయ్యలలోకి అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాల, వేగించిన ఉల్లిపాయ ముక్కలు కొన్ని, కొత్తిమీర తురుము కొద్దిగా, ఉప్పు, కారం, నిమ్మకాయ రసం, పెరుగు వేసి బాగా మ్యారినేట్ చేసి ఒక గంట పాటు ఫ్రిజ్ లో పెట్టాలి. ఇప్పుడు స్టవ్పై ఒక గిన్నె ఉంచి అందులో కొద్దిగా నెయ్యి వేసి బిర్యానీ ఆకులు, మొగ్గ, లవంగాలు, యాలకులు వేసి వేయించుకోవాలి. అదేవిధంగా రెండు కప్పుల బాస్మతి బిర్యానికి నాలుగు కప్పుల నీటిని వేసి 70 శాతం బియ్యం ఉడికిన తర్వాత వంచుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న రొయ్యలను మిశ్రమం ఒక పొర వేయాలి. ఆ తర్వాత బాస్మతి రైస్ వేయాలి. ఈ విధంగా పొరలుపొరలుగా వేసుకున్న తర్వాత చివరికి వేయించి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము, పుదీనా ఆకులను వేసి మూత పెట్టి చుట్టూ ఆవిరైపోకుండా మైదా పిండితో కవర్ చేసి ఒక పదిహేను నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించాలి. ఈ విధంగా పదిహేను నిమిషాలు తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రొయ్యల బిర్యానీ తయారైనట్లే.