చాలామంది చేపల పులుసు తినడానికి ఇష్టపడరు కానీ చేపల ఫ్రై అంటే చాలా ఇష్టపడతారు. మరి ఎంతో రుచికరమైన, నోరూరించే చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
*చేపలు 500 గ్రాములు
*అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్
*కార్న్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు
*ఒక టేబుల్ స్పూన్ శనగపిండి
*ఉప్పు టేబుల్ స్పూన్
*కారం టేబుల్ స్పూన్
*గరంమసాలా టేబుల్ స్పూన్
*నిమ్మకాయ ఒకటి
*పెరుగు చిన్నకప్పు
*ఫుడ్ కలర్ చిటికెడు
*నూనె
తయారీ విధానం
ముందుగా చేపలను శుభ్రంగా కడిగి మరీ పెద్ద సైజులో కాకుండా మోస్తరుగా కత్తిరించి పెట్టుకోవాలి. చేపముక్కలు చిన్నగా ఉన్నప్పుడే బాగా ఉప్పు, కారం పడతాయి. శుభ్రం చేసుకున్న చేపలను ఒక గిన్నెలో తీసుకొని వాటిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, ఉప్పు, శెనగపిండి, కార్న్ పౌడర్, గరం మసాల, పెరుగు వేసి బాగా కలపాలి. ఇందులోకి మనకు అవసరం అనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేకపోతే లేదు అది మీ ఇష్టం. అదేవిధంగా నిమ్మకాయ రసం వేసి,ఈ మిశ్రమం మొత్తం చేపముక్కలకు అంటుకునే విధంగా కలపాలి.ఈ విధంగా కలిపిన చేపల మిశ్రమాన్ని ఒక రెండు గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచుకోవాలి.
రెండు గంటల తర్వాత ఫ్రిజ్ నుంచి బయటకు తీసి పాన్ పై కొద్దిగా నూనె వేసి చేపముక్కలను చిన్న మంటపై అటూ ఇటూ కదిలిస్తూ చేప ముక్క ముదురు ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి. ఈ విధంగా అన్ని ముక్కలు వేయించిన తర్వాత వీటిలోకి కొద్దిగా నిమ్మకాయ, ఉల్లిపాయను కలిపి తీసుకుంటే ఎంతో రుచికరమైన చేపల ఫ్రై తయారైనట్లే.