కరోనా నేపథ్యంలో ఇప్పటికే అనేక రంగాల్లో కొన్ని కోట్ల మంది ఉద్యోగాలను, ఉపాధిని కోల్పోయారు. అయితే ఇది చాలదన్నట్లు బ్యాంక్ ఆఫ్ అమెరికా ఓ షాకింగ్ విషయం వెల్లడించింది. 2022 వరకు దేశంలో ఐటీ రంగంలో 30 లక్షల మంది ఉద్యోగాలను కోల్పోతారని తెలిపింది. దేశంలో ప్రస్తుతం 1.60 కోట్ల మంది ఉద్యోగులు ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. వారిలో 30 లక్షల మంది మరో ఏడాది కాలంలో ఉద్యోగాలను కోల్పోతారని వెల్లడైంది.
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆటోమేషన్ విస్తరిస్తోంది. మనుషులు చేయాల్సిన చాలా పనులను రోబోలే చేస్తున్నాయి. ఇక ఐటీ రంగంలోనూ ఆటోమేషన్ సంచనాలను సృష్టిస్తోంది. దీని వల్లే రానున్న ఏడాది కాలంలో ఏకంగా 30 లక్షల మంది ఉద్యోగాలను కోల్పోతారని తెలిసింది. ఈ క్రమంలో సాఫ్ట్‌వేర్ కంపెనీలకు రూ.7.30 లక్షల కోట్లు ఆదా అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కోవిడ్ కారణంగా అనేక మంది ఉద్యోగాలను కోల్పోగా ఈ వార్త ఐటీ ఉద్యోగులకు షాక్‌నిచ్చింది.
కాగా కోవిడ్ నేపథ్యంలో యువత, వయస్సు పైబడిన వారు ఉద్యోగాలను ఎక్కువగా కోల్పోయారని ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ ఎఫ్ఐఎస్ చేపట్టిన తాజా సర్వేలో వెల్లడైంది. 55 ఏళ్లకు పైబడిన వారిలో 6 శాతం మంది, 24 ఏళ్ల లోపు వారిలో 11 శాతం మంది కోవిడ్ కారణంగా ఉద్యోగాలను కోల్పోయారు. అయితే మరో ఏడాదిలో అంత భారీ సంఖ్యలో ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోనుండడం సంచలనం కలిగిస్తోంది.