కరోనా వైరస్ కేవలం మనుషులను మాత్రమే కాకుండా మనుషులలో ఉండే మానవత్వాన్ని కూడా చంపేసింది. ఈ విధమైన రోజులు వస్తాయని ఎప్పుడూ కూడా ఊహించలేదు. కరోనా మహమ్మారి వల్ల ఎన్నో మరణాలు సంభవిస్తున్నాయి.ఈ క్రమంలో ఎన్నో కన్నీటి గాథలు వెలుగులోకి వస్తున్నాయి. మనుషులను కూడా అంటరానివారుగా చూడటం మొదలు పెడుతున్నారు.
తాజాగా ఉత్తరప్రదేశ్ లక్నో లో చోటు చేసుకున్న హృదయ విదారక ఘటన అందరిని కంటతడి పెట్టించింది. గత వారం రోజుల నుంచి తన 13 సంవత్సరాల కొడుకు జ్వరంతో బాధ పడుతున్నాడు. అయితే అది సాధారణమైన జ్వరం కావడంతో ఇంటివద్దనే చికిత్స అందిస్తున్నాడు. జ్వరం తీవ్రత అధికంగా ఉండడంతో చిన్నారి మృత్యువాత పడ్డాడు.
మృతి చెందిన తన 13 సంవత్సరాల కొడుకు మృతదేహాన్ని ఎత్తడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో స్వయానా తన తండ్రి ఒక కాలువ వద్ద గోతి తీసి తన కొడుకు శవాన్ని భుజంపై వేసుకొని దహన సంస్కారాలు పూర్తి చేసిన ఘటన పలువురిని కంటతడి పెట్టిస్తోంది. ఈ సందర్భంగా తండ్రి సూరజ్ పాల్ మాట్లాడుతూ తన కొడుకు కరోనాతో చనిపోలేదని, అయినప్పటికీ తన కొడుకు మృతదేహాన్ని ఎత్తడానికి ఎవరూ ముందుకు రాలేదని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.