గత మూడు రోజుల క్రితం తన ప్రాణాలను లెక్కచేయకుండా, తన ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా కూడా రైల్వే పట్టాలపై పడిన చిన్నారిని ప్రాణాలకు తెగించి కాపాడిన రైల్వే ఉద్యోగి మయూర్ షెల్కే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసలను అందుకుంటున్నాడు. మయూర్ చేసిన ధైర్యసాహసాలకు భారత రైల్వే శాఖ మంత్రి అభినందనలు తెలిపారు.అదేవిధంగా ఇతను ధైర్యసాహసాలను గుర్తించిన రైల్వే శాఖ ఇతనికి 50 వేల రూపాయల నగదు బహుమతిగా అందజేసింది.
మయూర్ దైర్యసాహసాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇతనిపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ డెవలప్మెంట్ సైతం ఇతనికి రూ.50 వేల నగదును ప్రకటించింది. అదేవిధంగా ఆనంద్ మహీంద్ర కూడా ట్విట్టర్ ద్వారా రియల్ హీరో అంటూ మయూర్ పై ప్రశంసలు కురిపించారు.
తన ప్రాణాలను పణంగా పెట్టి రైలుకి ఎదురెళ్లి చిన్నారిని కాపాడిన షెల్కేకు ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ జావా.. బైక్‌ను బహుమతిగా ఇవ్వనుంది. ఈ మేరకు ఆ సంస్థ చీఫ్ అనుపమ్ థరేజా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇతని ధైర్యసాహసాలకు తమ కుటుంబం మొత్తం అభినందిస్తోంది. ఇతని ధైర్యసాహసాలకు గుర్తుగా హీరోస్ ఇనీషియేటివ్‌లో భాగంగా అవార్డుతో సత్కరించాలని భావించినట్లు అనుపమ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.