Kaala Paani Season 2 OTT : ప్రస్తుతం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లకి మంచి క్రేజ్ పెరుగుతుంది. థియేటర్లలో సినిమాలు రిలీజవుతున్నా చాలామంది ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్లే పలు ఓటీటీ సంస్థలు డిఫరెంట్ కంటెంట్ మూవీస్, వెబ్ సిరీసులను రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాలా పానీ అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్‌లో అక్టోబర్ 18న కాలా పానీ మొదటి సీజన్ రాగా, ఇది ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. అండమాన్ జైలు నేపథ్యానికి సస్పెన్స్ ను జోడించి ఆసక్తికరంగా ఈ సిరీస్ ను రూపొందించారు
పోషమ్ పా పిక్చర్స్ బ్యానర్‍పై బిశ్వపతి సర్కార్, అమిత్ గోలాని, సందీప్ సాకేత్, నిమిషా మిశ్రా సంయుక్తంగా కాలాపానీ సిరీస్‌ను నిర్మించారు. సమీర్ సక్సెనా, అమిత్ గోలాని దర్శకత్వం వహించారు. కాలా పానీ వెబ్ సిరీసులో బాలీవుడ్ ప్రముఖ నటి మోనా సింగ్, అశుతోష్ గోవారికర్, అమీ వాఘ్, సుకాంత్ గోయెల్, వికాస్ కుమార్, అరుషి శర్మ, రాధిక మెహ్రోత్రా, చిన్మయ్ మాండ్లేకర్, పూర్ణిక ఇంద్రజిత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.తొలి పార్ట్‌కి మంచి క్రేజ్ దక్కడంతో ఇప్పుడు రెండో పార్ట్ కి కూడా నెట్‌ఫ్లిక్స్ సన్నాహాలు చేస్తుంది. త్వరలోనే సెకండ్ సీజన్ కూడా విడుదల చేయనున్నట్టు ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. ఇందుకు సంబంధించి వీడియో కూడా విడుదల చేసింది.

అండమాన్ నికోబార్ దీవుల్లో అంతుచిక్కని వ్యాధి ప్రబలడం, ఆ వ్యాధి నుంచి తప్పించుకోవడం, నివారణను కనుగొనేందుకు ప్రయత్నించడం లాంటి అంశాలతో పాటు ఇందులో మానవ సంబంధాలు, ప్రేమలు, భావోద్వేగాలు వంటి వాటితో తొలి పార్ట్ చాలా హృద్యంగా తెరకెక్కించారు. అయితే ఆ వ్యాధికి పరిష్కారం ఏంటనేది రెండో పార్ట్ లో చూపిస్తారా అని నెటిజన్స్ భావిస్తున్నారు. కాలాపానీ తొలి పార్ట్ రిలీజ్ అయిన వారంలోనే నెట్‍ఫ్లిక్స్ నాన్-ఇంగ్లిష్ సిరీస్‍ల లిస్టులో 11 దేశాల్లో టాప్-10 ట్రెండింగ్‍లో నిలిచింది.