మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఏపీ ప్రభుత్వం అశోక్ గజపతి రాజు అన్న కుమార్తె సంచయిత గజపతి రాజుని 2020లో ట్రస్టు చైర్మన్‌గా నియమించింది. అలాగే సింహాచలం దేవస్థానం చైర్మన్‌గా కూడా ఎంపిక చేసింది. దీనిపై వివాదం చెలరేగింది. ఈ క్రమంలో అశోక్ గజపతి రాజు హైకోర్టులో కేసు వేసి విజయం సాధించారు. దీంతో ఆ రెండు బాధ్యతలను ఆయన తిరిగి చేపట్టారు. దీంతో సంచయిత పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
అయితే సంచయితకు త్వరలోనే ఎమ్మెల్సీ పదవి ఇవ్వొచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమెకు ఏ పదవీ ఇవ్వకుండా అలాగే వెనక్కి పంపిస్తే పార్టీ పరంగా ఇబ్బందులు వస్తాయని, పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతుందని సీఎం జగన్ భావిస్తున్నారట. అందుకని రాష్ట్రంలో ఖాళీ అయిన 7 ఎమ్మెల్సీ స్థానాల్లో ఆమెకు ఒక స్థానం ఇవ్వొచ్చని చర్చించుకుంటున్నారు.
నిజానికి మాన్సాస్ ట్రస్టు వ్యవహారంలో మొదట్నుంచీ ప్రతిపక్షాలు విమర్శించాయి. తరువాత కోర్టు కేసులు.. ఆ తరువాత సంచయిత పదవులు పోవడం.. ఇవన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయి. ఈ క్రమంలో ఆమెకు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా అలాంటి విమర్శలు అన్నింటికీ చెక్ పెట్టాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.