ప్రపంచవ్యాప్తంగా ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ప్రజలు జరుపుకుంటారు. కానీ తెలుగు సంవత్సరం ప్రారంభాన్ని తెలుగు ప్రజలు మాత్రమే జరుపుకుంటారు. అది తెలుగు వారికి మాత్రమే ప్రత్యేకం. నూతన తెలుగు సంవత్సరం ప్రారంభం రోజునే ఉగాది అని కూడా పిలుస్తారు. అంటే.. ఉగ అనే పదానికి యుగం అనే అర్థం వస్తుంది. ఆది అంటే ఆరంభం అన్నమాట. అంటే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుందని అర్థం.
భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడు ఉగాది వస్తుంది. సృష్టి ఆ రోజే జరిగిందని కూడా పురాణాల్లో చెప్పారు. అలాగే వేదాలను హరించిన సోమకున్ని మత్స్యావతారంలో ఉండే విష్ణువు వధిస్తాడు. దీంతో వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగిస్తారు. ఈ క్రమంలో విష్ణువు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక శాలివాహన చక్రవర్తి ఈ రోజునే శాలివాహన యుగకర్తగా పేరుగాంచాడు. అందువల్లే ఈ రోజును ఉగాదిగా జరుపుకుంటున్నారని కూడా చెబుతారు.
ఉగాది రోజునే నూతన తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది. కనుక ఇది తెలుగు వారి పండుగ. ఉగాది రోజున ఉగాది పచ్చడిని సేవించడం, పంచాంగం వినడం ఆనవాయితీ. ఇక మరాఠీ వారు ఈ పండుగను గుడిపడ్వాగా జరుపుకుంటారు. తమిళులు పుత్తాండు పేరిట, మళయాళీలు విషుగా, సిక్కులు వైశాఖీగా, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్‌గా జరుపుకుంటారు. పేరేదైనప్పటికీ పండుగలోని భావం ఒక్కటే. నూతన సంవత్సరానికి ఆరంభం ఉగాది. ఆ రోజున అంతా మంచే జరగాలని కోరుకుంటారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. ఇలా ఉగాది పండుగను జరుపుకుంటారు.