తెలుగు నూతన సంవత్సరం ఆరంభం రోజును ఉగాది పండుగగా తెలుగు ప్రజలు జరుపుకుంటారన్న సంగతి తెలిసిందే. ఆ రోజున తెలుగు వారి ఇండ్లలో పండుగ సందడి నెలకొంటుంది. తెలుగు వారు తమ సంప్రదాయ రుచులను ఆరగిస్తారు. తీపి వంటకాలను చేసుకుంటారు. ముఖ్యంగా ఉగాది రోజు తయారు చేసే ఉగాది పచ్చడికి ఎంతగానో ప్రాధాన్యత ఉంటుంది. దీన్ని అందరూ ఇష్టంగా తింటారు. దీని వల్ల తమకు ఆ ఏడాది అంతా శుభం కలుగుతుందని, అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భావిస్తారు. ఇక ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలంటే…
ఉగాది పచ్చడిలో ఆరు రకాల పదార్థాలను వేస్తారు. ఆ ఆరు పదార్థాలు ఆరు రుచులను కలిగి ఉంటాయి. తీపి, పులుపు, వగరు, ఉప్పు, కారం, చేదు ఇలా 6 రుచులు అందులో ఉంటాయి.
ఉగాది పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు
- వేప పువ్వు – 1 కప్పు
- బెల్లం పొడి – 1 కప్పు
- కొబ్బరికోరు – 1 కప్పు
- బాగా మగ్గిన అరటి పండ్లు – 6
- మామిడికాయ – 1
- కొత్తకారం – చిటికెడు
- ఉప్పు – అర టీ స్పూన్
- చింత పండు – కొద్దిగా
- నిమ్మకాయ – కొద్దిగా
- చెరుకు ముక్కలు – తగినన్ని
ఉగాది పచ్చడి తయారీ విధానం
చింత పండులో నీళ్లు పోసి ముందుగా పులుసు తీయాలి. తరువాత అరటి పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మామిడికాయ తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వేప పువ్వు తప్ప అన్ని పదార్థాలను వేసి బాగా కలపాలి. చివర్లో వేప పువ్వు వేయాలి. కొందరు చెరుకు ముక్కలకు బదులుగా చక్కెర, బెల్లం కూడా వేస్తారు. ఇలా ఉగాది పచ్చడిని తయారు చేసి ఇంటిల్లిపాదీ తీసుకుంటారు.
ఆయుర్వేదం – ఉగాది పచ్చడి
ఉగాది పచ్చడిలో నిజానికి ఆయుర్వేదం దాగి ఉంది. ఆ పచ్చడి ఆరు రుచుల కలయిక. కనుక నిత్యం ఆరు రకాల రుచులకు చెందిన ఆహారాలను తీసుకోవాలని, దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. కనుక ఆ విషయాన్ని గుర్తు చేసేందుకే ఉగాది రోజున ఉగాది పచ్చడి తింటారని కూడా చెబుతారు.