ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో పితృ పక్షాలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఉన్న రోజులను పితృ పక్షాలు అంటారు. ఈ 15 రోజులలో మన ఇంట్లో.. చనిపోయిన మన పూర్వీకులకు మన తల్లిదండ్రులకు పిండప్రదానాలు చేయడం వల్ల వారి ఆత్మ శాంతిస్తుందని పండితులు చెబుతున్నారు.
అలాగే చనిపోయిన మన పెద్ద వారి పేరున పూజ చేయించి పిండ ప్రదానం చేసిన తర్వాత కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల వారి ఆత్మ సంతృప్తి కలిగి మనపై ఉన్నటువంటి పితృ దోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. మరి పితృ దోషాలు తొలగి పోవాలంటే ఏ విధమైనటువంటి దానాలు చేయాలో ఇక్కడ తెలుసుకుందామా..!
పిండ ప్రదానం చేసిన తర్వాత మన పెద్ద వారి పేరుపై ఇతరులకు నల్లనువ్వులు, వెండి వస్తువులు, వస్త్రాలు, బెల్లం, ఉప్పు, పాద రక్షలు, గొడుగు, భూమి వంటి వస్తువులను దానం చేయాలి. అయితే ఇవన్నీ తప్పనిసరిగా దానం చేయాలన్న ఉద్దేశం ఏమీ లేదు, కానీ మన స్థోమతకు తగ్గట్టుగా ఉప్పు, బెల్లం, నల్లనువ్వులను దానం చేసినప్పటికీ పితృదేవతలు సంతోషపడి వారి ఆత్మశాంతి పడటమే కాకుండా మనపై ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి అన్ని శుభాలే కలుగుతాయి.