ప్రతి ఏడాది వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అని పిలుస్తారు. ఈ వైశాఖ పౌర్ణమిని మహా వైశాఖి.. బుద్ధ పూర్ణమి అని కూడా పిలుస్తారు.ఈ వైశాఖ పౌర్ణమి రోజు బుద్ధుడు జన్మించాడని అందుకు ప్రతీకగా బౌద్ధ మతస్తులు ఈరోజు బుద్ధుడి జయంతిగా పురస్కరించుకుంటారు. అదేవిధంగా బుద్ధుడు జ్ఞానోదయం పొందినది కూడా వైశాఖ పౌర్ణమి రోజు కావటంవల్ల ఈ పౌర్ణమి ఎంతో విశిష్ఠతను సంతరించుకుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు.
ఈ ఏడాది వైశాఖ పౌర్ణమి మే 26 బుధవారం వస్తుంది. పౌర్ణమి తిథి మే 25న 8.29pm ప్రారంభమయ్యి మే 26న సాయంత్రం 4.43 pm ముగుస్తుంది. ఎంతో విశిష్టత కలిగిన ఈ పౌర్ణమి రోజు బౌద్ధ మతాన్ని స్వీకరించిన వారు ఎంతో ఘనంగా బుద్ధ పౌర్ణమి వేడుకలను నిర్వహించుకుంటారు.
బౌద్ధ మతస్థులు అందరు తెల్లని రంగు వస్త్రాలను ధరించి భక్తిశ్రద్ధలతో బుద్ధుడికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే బౌద్ధ మతస్తులు ఆలయానికి చేరుకుని స్వామివారి విగ్రహాన్ని నీటిలో ఉంచి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహిస్తారు.అదే విధంగా పెద్ద ఎత్తున ఉపన్యాస కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు.ఎంతో పవిత్రంగా భావించే బౌద్ధ మతస్తులు పౌర్ణమి రోజు ఎటువంటి మాంసాహారాన్ని తినరు.బుద్ద పూర్ణిమ సందర్భంగా బీహార్ లోని బోధ్ గయాలో ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన మహా బోధి ఆలయాన్ని ఎంతో మంది భక్తులు సందర్శిస్తారు. బుద్ధుడికి జ్ఞానోదయం అయినది ఈ వృక్షం కింద కనుక భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని బుద్ధుడి జయంతి ఉత్సవాలను నిర్వహిస్తారు.