టెక్నాలజీని ఉపయోగించుకుని మనం ఎన్నో గొప్ప కార్యాలను చేపట్టవచ్చు. కానీ ఇదే అవకాశంగా భావించి కొందరు అదే టెక్నాలజీని ఉపయోగించుకుని చెడు పనులను కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ముఠా యాపిల్ కంపెనీకి చెందిన వాచ్ ను ఉపయోగించి ఏకంగా మూడు కోట్ల రూపాయల దొంగతనానికి పాల్పడింది. ఈ ఘటన అమెరికాలోని కనెక్టికట్‌లో గత ఏడాది జరిగింది. అయినప్పటికీ ఇందుకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఒక ముఠా పలు దొంగతనాలకు పాల్పడుతూ ఉండగా ఒక రోజు బ్యాంకు నుంచి ఒక వ్యక్తి బరువైన బ్యాగ్ ను తీసుకువెళ్లడం గమనించారు. ఈ క్రమంలోనే ఆ బ్యాగును దొంగతనం చేయాలని భావించిన యువకులు ఆ కారు బంపర్ కింద స్మార్ట్ ఆపిల్ వాచ్ ని అతికించారు. ఆ కారు వెళ్తున్న మార్గంలోనే దుండగులు కూడా ప్రయాణించారు.
ఇంతలో ఆ కారు హోటల్ దగ్గరికి వెళ్లడంతో సదరు వ్యక్తి హోటల్ లోపలికి వెళ్ళాడు. అయితే ఈ దొంగ ముఠాలలో ఒక వ్యక్తి కారు విండోకి షూట్ చేసి అందులో బ్యాగ్ ఉందా లేదా చెక్ చేశాడు. ఈ క్రమంలోనే బ్యాగ్ కారులో లేకపోగా ఆ వ్యక్తి హోటల్ లో ఏ గదిలో ఉన్నాడో అక్కడికి వెళ్లి రూమ్ డోరు కొట్టారు. ఆ వ్యక్తి తలుపు తీయగా నుదుటన గన్ పెట్టి అతన్ని బాత్రూంలో బంధించి దొంగలు ఆ డబ్బులు ఉన్న బ్యాగు దొంగలించారు. అయితే ఆ దొంగలు ఆపిల్ స్మార్ట్ వాచ్ ఉపయోగించి ఈ దొంగతనానికి పాల్పడినట్లు హోటల్ లో ఉన్న టెక్నికల్ సెన్సార్ల ద్వారా బయట పడింది. ఈ విధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని దొంగలు ఏకంగా మూడు కోట్ల రూపాయలను ఎంతో అవలీలగా దొంగతనం చేశారు.