ప్రస్తుతం దేశం మొత్తం కరోనా సెకండ్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తప్పకుండా కరోనా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ విధంగా బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి పలు చోట్ల పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించగా మరికొన్ని చోట్ల జరిమానా వసూలు చేస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్ ఇండోర్ సిటీలో ఓ వ్యక్తి మాస్క్ సరిగా భరించలేదని ఓ వ్యక్తిపై పోలీసులు విచక్షణా రహితంగా ప్రవర్తించారు.
35 సంవత్సరాల వయసున్న ఓ వ్యక్తి తన తండ్రి హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా అతని కోసం భోజనం తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే మాస్కు సరిగా ధరించలేదంటూ ఆ వ్యక్తిని పోలీసులు చితకబాదారు. ఆ వ్యక్తిని కొట్టడమే కాకుండా రోడ్డుపై పడేసి తలపై కాళ్ళు పెట్టి మరి ఆ వ్యక్తి పట్ల ఎంతో దారుణంగా ప్రవర్తించారు. ఆ వ్యక్తి బంధువులు ఎంత వేడుకుంటున్నప్పటికీ పోలీసులు కనీసం కనికరం చూపకుండా పోలీసులు ఆ వ్యక్తిని విచక్షణారహితంగా కొట్టారు.
ఇండోర్ సిటీ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పలు చిత్రాలను స్థానికులు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసు ఉన్నతాధికారుల వరకు చేరింది. ఈ విషయంపై ఉన్నత అధికారులు స్పందించి ఆ వ్యక్తి పట్ల సదరు పోలీసులు ప్రవర్తించిన తీరును పరిగణలోకి తీసుకొని ఆ ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేస్తున్నట్లు తెలియజేశారు.