ఫుడ్ డెలివరీ యాప్‌ల మధ్య నెలకొన్న విపరీతమైన పోటీ కారణంగా డెలివరీ బాయ్‌లు ఎన్నో కష్టాలకు ఓర్చి ఆహారాన్ని వేగంగా డెలివరీ చేయాల్సి వస్తుంది. లేదంటే యాప్ లో తక్కువ రేటింగ్‌ను పొందుతారు. అయితే డెలివరీ బాయ్స్ ఎంత వేగంగా ఫుడ్‌ను డెలివరీ చేసినా కొన్నిసార్లు రెస్టారెంట్లలో ఆలస్యం జరుగుతుంది. కనుక ఆ విషయంలో ఎవరూ ఏమీ చేయలేరు. అయితే ఇలాగే ఓ రెస్టారెంట్‌లో ఆలస్యం జరిగే సరికి మాటా మాటా పెరిగి ఆ డెలివరీ బాయ్ ఏకంగా రెస్టారెంట్ ఓనర్‌ను గన్‌తో కాల్చి చంపేశాడు. వివరాల్లోకి వెళితే..
గ్రేటర్ నోయిడాలోని మిత్రా హౌసింగ్ సొసైటీలో ఆన్‌లైన్ ఫుడ్ జమ్‌జమ్ అనే రెస్టారెంట్‌ను సునీల్ దాద్రి అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. అయితే మంగళవారం మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ కస్టమర్ ఆర్డర్ మేరకు చికెన్ బిర్యానీ, పూరీ సబ్జీ తీసుకునేందుకు ఆ రెస్టారెంట్‌కు వచ్చాడు. అయితే అనుకోకుండా అందులో పనిచేసే ఓ వర్కర్‌తో ఆ డెలివరీ బాయ్ వాగ్వివాదానికి దిగాడు.
ఈ క్రమంలో గొడవ ఓ దశలో తారాస్థాయికి చేరుకుంది. అయితే ఓనర్ సునీల్ మధ్యలో కలగజేసుకుని ఇద్దరినీ శాంతింపజేసే ప్రయత్నం చేశాడు. కానీ డెలివరీ బాయ్ వినలేదు. చంపేస్తానని బెదిరించాడు. అంతేకాదు అతను అన్నంత పని చేశాడు. తన వద్ద ఉన్న గన్‌తో సునీల్‌ను కాల్చి చంపేశాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ డెలివరీ బాయ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.