Sai Dharam Tej : మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయాల బారిన పడిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి మాదాపూర్‌లోని తీగల వంతెన మీద నుంచి ఐకియా వైపు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్పోర్ట్స్ బైక్ మీద వెళ్తుండగా సడెన్‌గా బైక్ అదుపు తప్పి రోడ్డు మీద స్కిడ్ అయింది. దీంతో సాయి ధరమ్ తేజ్‌కు గాయాలయ్యాయి.
అయితే ఈ సంఘటన ఎలా జరిగిందనే విషయంపై పోలీసులు వివరాలను వెల్లడించారు. వర్షం కారణంగా రోడ్డు తడిగా ఉండడంతోపాటు ఆ సమయంలో రోడ్డు మీద ఇసుక ఉందని, దీంతో బైక్ స్కిడ్ అయిందని, అందుకనే ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. సాయిధరమ్ తేజ్ వాహనాన్ని అదుపు చేయలేకపోయారని అందువల్లే కింద పడిపోయారని అన్నారు.
https://twitter.com/IndiaDailyLive/status/1436561316307558402?s=20
ప్రమాదం జరిగిన సమయంలో సాయిధరమ్ తేజ్ మద్యం సేవించలేదని, ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు. కాగా ఆ ప్రమాదం సైబరాబాద్ కమిషనరేట్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఐకియా స్టోర్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ కుడి కంటి పైభాగంతోపాటు ఛాతిలో గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయనకు అపోలో హాస్పిటల్‌లో చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్సను అందిస్తున్నామని, మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో ఉంచుతారని తెలిపారు.