జీవితంలో ఎన్నో కలలు కని ఆ కలలను నిజం చేసుకోవడానికి అత్తవారింట అడుగుపెట్టిన నవవధువు తన కాళ్ల పారాణి ఆరకముందే కాటికి కాలు చాపింది. పెళ్లి జరిగి 7 రోజులు కూడా జరగకుండానే ఆ వధువు ఏడడుగుల బంధానికి స్వస్తి పలికింది.ఇంటి ముందు పందిరి కూడా తీయకుండానే నవవధువు పరలోకానికి వెళ్లిపోవడంతో ఇరు కుటుంబాలు గుండెలవిసేలా చేసిన రోదనలు ఇతరులకు కన్నీరును తెప్పించాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.
సామర్లకోట మండలం మేడపాడుకు చెందిన తొండారపు వీరవెంకటలక్ష్మి పెద్ద కుమార్తె అశ్వినీ స్వాతి అనే యువతికి కోరుకొండ మండలం గాదరాడకు చెందిన కనుమురెడ్డి అశోక్‌తో గత నెల 29న వివాహం చేశారు. రెండు రోజుల కిందటే వధూవరులిద్దరూ వరుడి స్వగ్రామానికి వచ్చారు. అయితే ఆషాడమాసం వస్తున్న కారణంగా నవ వధువును పుట్టింటికి తీసుకెళ్లాలని, సోమవారం మంచి రోజు కావడంతో ఆమెను పుట్టింటికి పంపడానికి ప్రయాణం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే అందరూ ఇంట్లో ఉండగానే స్వాతి లోపలికి వెళ్లి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్వాతికి అశోక్ వరుసకు మేనమామ అవుతాడు. అశోక్ తాపీ పని చేసేవాడు.ఈ క్రమంలోనే కొత్త ఇంటిని కట్టించి వివాహం చేసుకొని ఎన్నో ఆశలతో జీవితంలోకి అడుగుపెట్టిన అశోక్ అశ్విని మృతదేహం చూసి కుప్పకూలిపోయాడు. అయితే ఇరు కుటుంబాలు బంధువులు కావడంతో ఆమె మృతి చెందిన విషయం పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మిగతా కార్యక్రమాలను చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి పోలీసులు రావడంతో అశ్వినీ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.