కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది జీవితాలను ఆగమాగం చేసింది. ఎంతో మంది చనిపోయారు. ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. మన దేశంలో ప్రజలపై ఈ మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఉపాధి కోల్పోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పనుల కోసం వెంట బెట్టుకెళ్తున్నారు. ఇక కొందరు విద్యార్థులు ఓ వైపు పనిచేస్తూనే మరోవైపు చదువుకుంటున్నారు. వారి గురించి తెలిస్తే కన్నీళ్లు ఆగవు.
ఢిల్లీలోని కన్నాట్ అనే ప్రాంతం. కేజీ మార్గ్‌లో రద్దీగా ఉండే రహదారి. ఆ రహదారికి పక్కన ఫుట్‌పాత్‌పై ఓ బాలిక చదువుకుంటోంది. పైన మీరు చూస్తున్న చిత్రం అదే. ఆమెకు చదువుకోవాలనే ఆరాటం. కానీ పాపం కోవిడ్ వల్ల తల్లిదండ్రులకు ఉపాధి పోయింది. దీంతో చదువుకోవడం కష్టమైంది. ఆమె ఇద్దరు సోదరిలు ఆమెతోపాటు అక్కడి పీరాగర్హిలో ఉన్న సర్వోదయ కన్యా ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. ఆమె పేరు భూమిక.
తన ఇద్దరి సోదరిలు తల్లిదండ్రులతోపాటు కూలి పనులకు వెళ్తున్నారు. కానీ భూమిక మాత్రం ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు ఫుట్‌పాత్ మీద బర్డ్ ఫుడ్ విక్రయిస్తోంది. రోజూ అది అమ్మి ఎంతో కొంత సొమ్మును ఆమె ఇంటికి తీసుకెళ్లాలి. కానీ చదువుకోకపోతే ఎలా ? అందుకనే ఆమె ఓవైపు బర్డ్ ఫుడ్ అమ్ముతూ, మరోవైపు చదువును కొనసాగిస్తోంది. పరిస్థితులు ఎప్పటికీ ఇలాగే ఉండవు కదా, మాకూ మంచిరోజులు వస్తాయి, నేను చదువుకుని పోలీస్ ఆఫీసర్‌ను అవుతా.. అంటూ ఆ బాలిక ధైర్యంగా చెబుతోంది. ఆమె కల నెరవేరాలని కోరుకుందాం.