రోజురోజుకు మనం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉండగా కొందరు మాత్రం ఇంకా మూర్ఖంగానే ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుత కాలంలో కూడా ఎంతో మంది తల్లిదండ్రులు లింగ వివక్ష చూపుతున్నారు. తమకు మగ బిడ్డ కావాలనే ఉద్దేశంతో ఆడబిడ్డను పొత్తిళ్ళలోనే చిదిమేస్తున్నారు.తాజాగా మూడోసారి కూడా బిడ్డ పుట్టిందన్న ఉద్దేశంతో కన్నతల్లి ఆ ఆడబిడ్డ పట్ల కసాయి తల్లిగా మారిపోయిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
నామక్కల్ జిల్లా ఎరుంపట్టికి చెందిన చిన్నతంబి కుమారుడు సూర్య, కస్తూరి దంపతులకు ఇదివరకే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే కొడుకు కోసం మూడవసారి గర్భం దాల్చిన కస్తూరినీ ప్రసవం కోసం
నామక్కల్ ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. ఈ క్రమంలోనే కస్తూరి ఆస్పత్రిలో ఎవరికీ తెలియకుండా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయింది.
ఈ విధంగా కస్తూరి ఎవరికీ తెలియకుండా వెళ్లిపోవడంతో ఆసుపత్రి సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే కస్తూరి ఈనెల 13వ తేదీన తన కూతురు మృతిచెందినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పోలీసులకు అనుమానం రావడంతో ఆ చిన్నారిని తీసి పోస్టుమార్టం నిర్వహించగా ఆమె హత్య చేయబడినట్లు నిర్ధారణ జరిగింది. ఈ మేరకు పోలీసులు కస్తూరిని గట్టిగా విచారించగా.. మూడవ సారి కూడా ఆడపిల్ల పుట్టడంతో ఏమాత్రం జాలి దయ లేకుండా, కన్న మమకారం కూడా లేకుండా తానే స్వయంగా బిడ్డను చంపినట్లు ఒప్పుకుంది. దీంతో శుక్రవారం పోలీసులు కస్తూరిని అదుపులోకి తీసుకున్నారు.