పెళ్లి పేరిట కొందరు మహిళలు పురుషులను మోసం చేసిన సంఘటనలను ఇటీవలి కాలంలో చాలానే చూస్తున్నాం. అయినప్పటికీ ఈ తరహా మోసాలు ఆగడం లేదు. కొందరు పురుషులు పెళ్లి కావడం లేదని, తమకు వచ్చిన ఆఫర్‌ను కాదనలేక పెళ్లి చేసుకుంటున్నారు. అయితే వధువు చేతిలో మోసపోతున్నారు. కొందరు మహిళలు ఇలా పెళ్లి పేరిట నమ్మించి మోసం చేస్తున్నారు. పెళ్లి అయ్యాక అదును చూసి డబ్బు, నగలతో పారిపోతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని మణిపురి బెవార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పరౌంఖా గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తికి వయస్సు మీద పడుతున్నా పెళ్లి కావడం లేదు. దీంతో ఓ మధ్యవర్తి ద్వారా ఒక సంబంధం కుదిరింది. అయితే ఆ యువతి రాజును పెళ్లి చేసుకోవాలంటే ఎదురు కట్నం రూ.80వేలు ఇవ్వాలని అడిగారు. అందుకు రాజు తండ్రి సరేనని అంగీకరించాడు.
ఈ క్రమంలోనే వారికి ఓ ఆలయంలో వివాహం జరిపించారు. పెళ్లికి ముందు వధువుకు రూ.80వేలు ఇచ్చారు. అలాగే రాజు తండ్రి తన కోడలికి డబ్బు, నగలు, ఇతర బహుమతులను కూడా ఇచ్చాడు. అయితే పెళ్లి అయ్యాక సొంత గ్రామానికి తిరిగి వచ్చే క్రమంలో బస్టాండ్‌లో దంపతులు బస్సు కోసం వచ్చారు. తనకు దాహం అవుతుందని వధువు చెప్పే సరికి రాజు నీళ్లను తెచ్చేందుకు వెళ్లాడు. అదే అదునుగా భావించిన ఆ వధువు అక్కడి నుంచి డబ్బు, నగలతో పరారైంది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన రాజు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకుని సదరు మధ్యవర్తితోపాటు ఆ యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.